'Jada Shravan': ఇలా తగులుకుంటున్నాడేంటి రా బాబోయ్.. 'జడ శ్రవణ్'ను చూసి 'తల' పట్టుకుంటున్న 'కూటమి' నేతలు
'Jada Shravan': ఇలా తగులుకుంటున్నాడేంటి రా బాబోయ్.. 'జడ శ్రవణ్'ను చూసి 'తల' పట్టుకుంటున్న 'కూటమి' నేతలు

జడ శ్రవణ్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీ అధినేతగా, సామాజిక కార్యకర్త, మాజీ న్యాయమూర్తి, అడ్వొకేట్‌గా కొనసాగుతున్నాడు. జడ శ్రవణ్ కుమార్‌ను రాజకీయ ఆరోపణలు, ప్రభుత్వంపై విమర్శలు, రైతుల ఆందోళనలకు మద్దతు ఇస్తూ కార్యక్రమాల్లో పాలొంటుంటారు. గతంలో అమరావతి రైతుల హక్కుల కోసం పాదయాత్రలు చేపట్టగా, పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. రైతుల సమస్యలపై సుప్రీంకోర్ట్‌లో పిటిషన్లు కూడా వేశారు. అమరావతి రైతుల మద్దతుతో పాదయాత్రలు, దీక్షలు వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
గతంలో జగన్ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాడో ఇప్పుడు అదే తీరులో కూటమినీ ప్రశ్నిస్తున్నాడు. అధికారంలో ఎవరు ఉన్నా ప్రజా సమస్యలే ప్రమాణం అంటున్నాడు. ఈ క్రమంలో కూటమి సర్కార్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీ కంటే ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై టకీమనీ స్పందిస్తున్నారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాడు. ఈ క్రమంలో ఒక్కోసారి అతి తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు. 2029లో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబు, పవన్, లోకేష్ అందరూ ప్రత్యేక విమానాలు కొనుక్కొని ఇతర దేశాలకు పారిపాతారని అన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. వైసీపీ సోషల్ మీడియా రప్పా.. రప్పా అంటూ పుష్ప బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి దానిని విపరీతంగా సోషల్ మీడియాలో తిప్పుతున్నారు.
ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనితను నిలదీస్తున్న తీరు అన్ని రాజకీయ పక్షాల్ని ఆకట్టుకుంటోంది. ఇలా కదా నిగ్గదీసి అడగాలనే ముచ్చట కలుగుతోంది. కొన్ని సందర్భాల్లో జడ ఆగ్రహం, ఆవేశం కాస్త హద్దులు దాటుతున్న అభిప్రాయం కూడా లేకపోలేదు. 30 వేల మంది మహిళలను వాలంటీర్ల ద్వారా అక్రమ రవణా జరిగిందని పవన్ విమర్శించాడని, ఇప్పుడు కనీసం సుగాలి ప్రీతికి కూడా న్యాయం చేయడం లేదనే మొదట విమర్శలు చేసింది జడ శ్రవణే. టీటీడీ లడ్డూ ప్రసాదంలో పంది తదితర జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపించిన వారిని ఏ చెప్పుతో కొట్టాలని ఆయన ప్రశ్నించారు. ఈ విమర్శలు ప్రజలకు నేరుగా చేరడంతో టీడీపీ, జనసేన నాయకులు తలలు పట్టుకుంటున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి జగన్ కూడా ఏనాడూ ఇంతటి తీవ్ర మైన విమర్శలు చేయలేదని, ఈ పదాలు వాడలేదంటున్నారు. హోంమంత్రి వర్క్ ఫ్రం హోం శాఖ నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలికొదిలేశారంటూ మంత్రి అనితను టార్గెట్ చేస్తుంటారు.
మరోవైపు ప్రభుత్వం కొన్ని సంస్థలకు కేటాయిస్తున్న భూములపై న్యాయ పోరాటం చేస్తున్నారు. స్వతహాగా న్యాయమూర్తిగా పనిచేసిన జడ శ్రవణ్, ప్రస్తుతం న్యాయవాదిగా ఉంటూ కోర్టుల్లో పిటిషన్లు వేసి న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా కోర్టుల్లో తన గళాన్ని గట్టిగా వాదిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న అక్రమ గోదాములపై కూడా ఆయన పిటిషన్లు వేసి విజయాలను సాధించారు.
టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని, నిరాధార ఆరోపణలు చేసి, కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిన పాలకులను శిక్షించాలని కోరుతూ న్యాయ స్థానంలో పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు. టీడీపీ మీడియా ఇప్పుడు ఎందుకు చర్చ పెట్టడం లేదని, లడ్డూ కల్తీ వివాదంపై ఇప్పుడు డిబేట్లు పెట్టాలని, వాటికి తానొస్తానని టీడీపీ అనుకూల మీడియాకు సవాల్ విసిరాడు. సబ్జెక్టుపై తనకు ఉన్న పట్టు, వాగ్ధాటితో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తాడనే భయం కూటమి సర్కార్‌లోని నాయకులకు ఉంది. జడ శ్రవణ్‌ను కూటమి సర్కార్‌లోని నేతలు ధీటుగా ఎదుర్కొలేకపోతున్నారు. ఆయన మాట్లాడుతున్న తీరు, ప్రశ్నించే తత్వం, సమాధానాలు చెప్పలేక ప్రభుత్వ అధినేతలతో సహా ఇతర నేతలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.


