YCP Leader SrikanthReddy: చంద్రబాబూ.. మిమ్మల్ని ఎవరూ క్షమించరు..!
చంద్రబాబూ.. మిమ్మల్ని ఎవరూ క్షమించరు..!

రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌పై తెలంగాణా సీఎం వ్యాఖ్యలతో చంద్రబాబు బాగోతం బయటపడ్డా.. ప్రభుత్వం ఎదురుదాడి చేయడంపై వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుతో రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్న ఆయన.. అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అవసరమే లేదన్న మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
మరో వైపు మచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్ ఒకటే అంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో అబద్దపు వార్తలు రాయడాన్ని తప్పు పట్టారు. రాయలసీమ లిఫ్ట్ స్కీం ద్వారా వైఎస్ జగన్‌కి మైలేజ్ వస్తుందన్న అక్కసుతోనే తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విభజిత రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమ చేసిన మేలు శూన్యమని తేల్చి చెప్పారు.
అన్ని ప్రాంతాలు బాగుండాలన్నదే వైఎస్ జగన్ తపన అని.. తెలంగాణా వినియోగించుకున్నట్టే.. కృష్ణా జలాలతో సీమను స్టెబిలైజ్ చేసేందుకే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ చేపట్టారని స్పష్టం చేశారు. అయితే కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాన్ని రద్దు చేయడం తీరని ద్రోహమని ఆక్షేపించారు. తన కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టునే నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ లిఫ్ట్‌ను ప్రభుత్వం పూర్తి చేయాలని, లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని.. కానీ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, అలా చేస్తే చరిత్ర మిమ్నల్ని క్షమించదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..
కానీ సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన చేయడం కానీ, కనీసం దాన్ని పరిశీలించే యోచన కూడా చేయకుండా ఎదురుదాడికి దిగడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో రెండు రోజులగా అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీం అవసరం ఏముంది అనేలా హేళన చేయడంతో పాటు అడ్డుగోలుగా విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం. ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడి ప్రజలకు జరుగుతున్న నష్టంపై కనీసం ఆలోచన చేయకుండా తిరిగి ఎదురుదాడి చేయడం, వారి అనుకూల పత్రికల్లో అసలు ఈ ప్రాజెక్టే అవసరం లేదన్నట్టు వార్తలు రాయించిన తీరు అత్యంత దుర్మార్గం.


