Yoga Teachers : యోగా టీచర్ల నిరసన.. పోలీసుల జులుం..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజు కూడా కొనసాగింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజు కూడా కొనసాగింది. ఆ సమయంలో యోగా టీచర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మంత్రి లోకేష్ ఆదేశాల ప్రకారమే తమపై పోలీసులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని యోగా టీచర్లు ఆరోపించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి 1,056 మంది యోగా టీచర్లు సీఎం నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అయినా కలిచి తమ గోడును వినిపించాలని వాళ్లు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. యోగాసనాలు వేస్తూ నిరసనలతో లోకేష్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. ఆదేశాలతో పలువురిని అరెస్ట్ చేయగా.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమ వద్ద నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని, దురుసుగా ప్రవర్తించారని యోగా టీచర్లు వాపోయారు.
