ఓ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తన చేతిలో ఉన్న పదునైన పెన్సిల్ గొంతు కింది భాగంలో దిగడంతో అనంత లోకాలకు చేరాడు.

ఓ బాలుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో తన చేతిలో ఉన్న పదునైన పెన్సిల్ గొంతు కింది భాగంలో దిగడంతో అనంత లోకాలకు చేరాడు.
ఈ ఘటన ఖమ్మం జిల్లాలో కూసుమంచిలో జరిగింది. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన మేడవరపు ఉపేంద్రాచారి – మౌనిక దంపతులకు ఓ కుమారుడు విహార్ (8), కూతురు వర్షిత సంతానం. విహార్ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ, వర్షిత ఎల్‌కేజీ చదువుతున్నారు. బుధవారం ఉదయం పిల్లలిద్దరూ బస్సులో స్కూల్‌కు వెళ్లారు. మధ్యాహ్నం టాయిలెట్ కోసం విహార్ మిగతా విద్యార్థులతో కలిసి వెళ్లాడు. ఆ తర్వాత స్కూల్ గ్రౌండ్‌లో పరుగెత్తుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. అయితే బాలుడి చేతిలో పదునుగా చెక్కిన పెన్సిల్ ఉండటంతో బోల్తా పడగానే బాలుడి గొంతు కిందిభాగంలో అది దిగబడింది. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో విద్యార్థులు పైకి లేపి ఉపాధ్యాయులకు తెలిపారు.
కరస్పాండెంట్ నాగార్జున, ఉపాధ్యాయులు వచ్చి బాలుడిని స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు, అక్కడి నుంచి అంబులెన్స్‌లో ఖమ్మం తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు ఇంకాసేపట్లో వస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తుండగా ప్రమాదం విషయం తెలియడంతో ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. కాగా విహార్ చేతిలోని పెన్సిల్‌కు రక్తం మరకలు లేకపోవడంతో విహార్ మరణంపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. విహార్ స్నేహితులు, పాఠశాల కరస్పాండెంట్, ఉపాధ్యాయులతో పోలీసులు విచారించారు.


