కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం సమీపాన అనుమానాస్పద మరణాలు, మృతదేహాల పూడ్చివేతలు, ఖననాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి.

అసలు ధర్మస్థల పుణ్యక్షేత్రంలో ఏం జరిగింది..!

వందలాది మృతదేహాలు ఖననం లేదా పూడ్చడం నిజమేనా..!

బాధితులంతా మహిళలు, బాలికలు

మృతదేహాలపై లైంగిక వేధింపుల ఆనవాళ్లు..?

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఆలయ వివాదం..!

కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రం సమీపాన అనుమానాస్పద మరణాలు, మృతదేహాల పూడ్చివేతలు, ఖననాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ ఆలయ క్షేత్రం. ఈ ఆలయం శివుడు (మంజునాథుడు), అమ్మనవరు, చంద్రనాథ మరియు ధర్మ దైవాలైన కలరాహు, కలర్కాయి, కుమారస్వామి, కన్యకుమారి వంటి దేవతలు ఉన్నారు. ఈ ఆలయం జైన కుటుంబమైన హెగడేలచే నిర్వహించబడుతుంది, కానీ వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే హిందూ బ్రాహ్మణ పూజారులు పూజలు నిర్వహిస్తారు, ఇది దీని ప్రత్యేకత.

సంచలన విషయలు వెల్లడించిన మాజీ కార్మికుడు..!

అయితే ఈ ఆలయంలో పనిచేసిన ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు విసిల్‌బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశాడు. గత రెండు దశాబ్దాలలో వందలాది మహిళలు, బాలికల మృతదేహాలను ఆలయ పరిసరాల్లో పూడ్చినట్లు లేదా దహనం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మరణాలు అనుమానాస్పద రీతిలో జరిగాయని, లైంగిక దాడులకు గురైన తర్వాత హత్యలు జరిగాయని ఆరోపించాడు. 15 సంవత్సరాల క్రితం తన కుటుంబంలోని ఒక యువతి లైంగిక వేధింపుల కారణంగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విసిల్‌బ్లోయర్ వెల్లడించాడు. ధర్మస్థలలో 1995-2014 మధ్య కాలంలో పనిచేశానని, అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశానని ఆ మాజీ కార్మికుడు వివరించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్‌ బాలికలు ఉన్నారని.. వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని తెలిపాడు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని.. 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరోచోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను ఇలాగే ఖననం, దహనం చేసినట్లుగా చెప్పడం గమనార్హం. ధర్మస్థల నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్లు సమాచారం. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని.. దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పాడు. ఈకేసులో జులై 11న బెళ్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి.. అస్థిపంజర అవశేషాలు సహా సంబంధిత ఫొటోలను ఆధారాలుగా అందించినట్లు తెలుస్తోంది. కొందరి పేర్లను అందులో పేర్కొన్న అతడు.. ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించినట్లు సమాచారం.

13 స్థలాల్లో మృతదేహాలు..!

విసిల్‌బ్లోయర్ నేత్రావతి నది సమీపంలో 13-15 బరియల్ సైట్‌లు ఉన్నాయని తెలిపాడు.సైట్ నం. 1లో 2 మృతదేహాలు, సైట్ నం. 2లో 2 మృతదేహాలు, సైట్ నం. 3లో 2 మృతదేహాలు, సైట్ నం. 4 మరియు 5లో 6 మృతదేహాలు, సైట్ నం. 6, 7, 8లో 8 మృతదేహాలు, సైట్ నం. 9లో 6-7 మృతదేహాలు, సైట్ నం. 10లో 3 మృతదేహాలు, సైట్ నం. 11లో 9 మృతదేహాలు, సైట్ నం. 12లో 4-5 మృతదేహాలు, సైట్ నం. 13లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు పూడ్చడం లేదా దహనం చేసినట్లు తెలిపాడు.

రంగంలోకి సిట్‌ బృందం..!

దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరోపణలపై స్పందించి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ధర్మస్థలలో జరిగిన అసహజ మరణాల విషయంలో కూడా 100కు పైగా మహిళలు యువతుల మృతదేహాలను పూడ్చి పెట్టానంటూ మాజీ పారిశుద్య కార్మికుడు ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. 1995 నుంచి 2014 వరకు బలవంతంగా శవాలను పూడ్చి పెట్టినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. రేప్, మర్డర్‌ చేసిన శవాలను పాతి పెట్టడం దహనం చేశానని తన ఫిర్యాదులో కార్మికుడు తెలిపాడు. వీరిలో ఎక్కువమంది మహిళలు. స్కూల్ బాలికలే ఉన్నట్టుగా చెబుతున్నారు. కార్మికుడు తన ఫిర్యాదులో చాలా విషయాలు ప్రస్తావించాడు, ఇంతకాలం ప్రాణభయంతో దాచి పెట్టానని నిజం చెప్పాలని, ఇప్పుడు బయటక వచ్చానని తెలిపాడు అవి ఎక్కడెక్కడ పూడ్చి పెట్టానో అధికారులకు చూపిస్తానని, మొత్తం 15 ప్రదేశాలను గుర్తించారు. సిట్‌ బృందం విసిల్‌బ్లోయర్‌తో కలిసి నేత్రావతి నది సమీపంలోని ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టింది. స్పాట్ 1 వద్ద తవ్వకాలు పూర్తయ్యాయి కానీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే, సైట్ 6 వద్ద సైట్ నం. 6 వద్ద 15 ఎముకలు అంటే పుర్రె లేకుండా, పాక్షిక అస్థిపంజరం లభించాయి. ఇది కేసును కొత్త మలుపు తిప్పింది. భారీ యంత్రాలతో మిగిలిన ప్రాంతాల్లో తవకాలు జరపడానికి సిట్ కార్యకలాపాలు ముమ్మరం చేసింది.

మిస్టరీగా పలు కేసులు..?

2010లో కల్లెరిలోని పెట్రోల్ బంక్ సమీపంలో 12-15 ఏళ్ల బాలిక మృతదేహం, స్కూల్ యూనిఫామ్‌లో, లైంగిక వేధింపుల గుర్తులతో పూడ్చబడిందని ఆరోపణలు వస్తున్నాయి. 2003లో అనన్య భట్, 18 ఏళ్ల ఎంబీబీఎస్‌ విద్యార్థిని, ధర్మస్థల ట్రిప్ సమయంలో మాయమైందని, ఆమె తల్లి సుజాత భట్ ఆరోపించింది, పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోకుండా, తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో సౌజన్య, 17 ఏళ్ల బాలిక, రేప్ మరియు హత్య కేసులో నిందితులు ఎవరో ఇప్పటికీ తేలలేదు. సౌజన్య కేసులో, సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు, ఆధారాలు మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

రికార్డుల మాయం..!

ధర్మస్థలలో దాదాపు 15 ఏళ్లలో చోటు చేసుకున్న అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులన్నీ మాయమయ్యాయి. రికార్డులన్నీ ఒక క్రమ పద్ధతిలో మాయం చేసినట్టు తెలుస్తోంది. ఆర్టిఐ చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2000 సంవత్సరం నుంచి 2015 మధ్య బెల్తంగడి పోలీస్ స్టేషన్లో అదృశ్యమైన మహిళలు, యువతులు బాలికలకు చెందిన రికార్డులన్నీ గల్లంతయ్యాయని ఆర్టీఐ కార్యకర్త వెల్లడించారు. ఈ రికార్డులను డిజిటలైజ్ చేయకపోవడం చట్ట విరుద్ధం అని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో డిజిటలైజేషన్ సౌకర్యం ఉన్నప్పటికీ, ఈ రికార్డులు మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసు విచారణ సరైన రీతిలో జరగడం లేదని, దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రయల్‌ కోర్టులో సాక్షి ఆధారాలు సమర్పించారని, వాటి ఆధారంగా దర్యాప్తు చేయొచ్చన్నారు.

ఎవరినీ కాపాడడం లేదు..!

కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండు రావు స్పందిస్తూ.. ఈ కేసులో ప్రభుత్వం ఎవర్నీ రక్షించడం లేదన్నారు. దీన్ని సంచలనం చేయాలనుకోవడం లేదని, అయినప్పటికీ.. వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. సాక్షి చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేశాయని, ఆయన చెప్పేది నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆధారాలు లభ్యమైతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌదరి, గత 20 ఏళ్లలో ధర్మస్థల ప్రాంతంలో మాయమైన మహిళలు, విద్యార్థుల గురించి వివరణాత్మక నివేదికను కోరారు. అయితే బీజేపీ నేతలు మాత్రం దీనిని ఖండిస్తున్నారు, ఈ ఆరోపణల వెనుక కుట్ర ఉందని, ధర్మస్థల వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగడే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్యశాలలు, ఆయుర్వేద కళాశాలలు విద్యా సంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి.

ehatv

ehatv

Next Story