తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు పథకం(Free Bus Scheme) కండక్టర్లకు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది.

తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు పథకం(Free Bus Scheme) కండక్టర్లకు తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. రోజుకు రూ.5,000 నుంచి రూ.6,000 నగదు కలెక్షన్ తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు కండక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ పథకం కారణంగా బస్సుల్లో 90% నుంచి 95% వరకు మహిళలే ప్రయాణిస్తుండటంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, నగదు కలెక్షన్‌లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కలెక్షన్‌ను పెంచేందుకు కండక్టర్లకు అసాధ్యమైన టార్గెట్లు నిర్దేశిస్తున్నారు.

బస్సులు పూర్తిగా మహిళా ప్రయాణికులతో నిండిపోతుండటంతో, "డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?" అంటూ కండక్టర్లు (Conductor)ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పథకం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగి బస్సుల్లో రద్దీ అధికమవడంతో విధులు నిర్వహించడమే సవాల్‌గా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్లు పెట్టడం అసమంజసమని అధికారులను కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)పరిధిలో రోజుకు 24 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వారిలో 17 లక్షల మంది మహిళలే ఉన్నారని కండక్టర్లు చెబుతున్నారు. బస్సులు మహిళలతో నిండిపోవడంతో, పురుష ప్రయాణికులు క్యాబ్‌లు, మెట్రో, ఆటోల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఉచిత బస్సు పథకం అమలుకు ముందు గ్రేటర్ హైదరాబాద్‌లో రోజుకు రూ.4 కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ ఇప్పుడు అది కేవలం రూ.2 కోట్లకు పడిపోయిందని కండక్టర్లు వెల్లడిస్తున్నారు. ఈ పథకం కారణంగా టికెట్ ఆదాయం తగ్గడంతో, కొంతమంది డిపో మేనేజర్లు కండక్టర్లపై అసాధ్యమైన టార్గెట్లు విధిస్తున్నారని, ఇది పూర్తిగా అసంభవమని కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

Updated On 16 May 2025 11:36 AM GMT
ehatv

ehatv

Next Story