కుటుంబ కలహాలతో రెండున్నరేళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ కలహాలతో రెండున్నరేళ్ల కూతురుతో కలిసి ఓ తల్లి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లేక్‌పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం పృథ్వీ, కార్తీక అగర్వాల్ పాతబస్తీలో ఉంటారు. పృథ్వీ వ్యాపారి కాగా..కార్తీక అగర్వాల్ చార్టెడ్ అకౌంటెంట్. వీరికి రెండున్నర సంవత్సరాల కూతురు బియారా ఉంది. ఏడాది క్రితం ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు రావడంతో కార్తీక బహుదూర్పురాలోని పుట్టింట్లో ఉంటుంది. ఈ నెల 2వ తేదీన ఉదయం కార్తీక ఎవరికీ చెప్పకుండా తన కూతురుతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు బహుదూర్‌పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సోమవారం సాయంత్రం హుస్సేన్‌సాగర్‌లో ఓ మహిళ మృతదేహం తేలడంతో పోలీసులు వెలికితీసి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో విచారణ జరిపి అది కార్తీక అగర్వాల్ మృతదేహంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కార్తీక అగర్వాల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెతో పాటు రెండున్నరేళ్ల కూతురు కూడా ఉందని తెలిపారు. దీంతో పోలీసులు మరోమారు మంగళవారం హుస్సేన్ సాగర్‌లో గాలించగా చిన్నారి మృతదేహం కూడా సాగర్ జలాల్లో కనిపించింది. కేసును బహుదూర్‌పూరా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తామని లేక్‌పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.


