జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామానికి చెందిన గాదె మురళీధర్ -శోభ దంపతుల కుమారుడు గాదె యుగంధర్(29) దసరా పండుగకు గ్రామానికి వచ్చి

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామానికి చెందిన గాదె మురళీధర్ -శోభ దంపతుల కుమారుడు గాదె యుగంధర్(29) దసరా పండుగకు గ్రామానికి వచ్చి ఆదివారం రోజున తన మేనత్త కూమారుడు చందుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఉప్పల్ దాటిన తర్వాత రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.తీవ్రంగా గాయపడిన యుగంధర్‌ను నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. నాలుగు రోజులు చికిత్స అందించిన వైద్యులు నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఎన్ని రోజులు ఐసియులో పెట్టి చికిత్సలు చేసినా ప్రయోజనం ఉండదని, అన్ని అవయవాలు పని చేస్తున్నందున అవయవాలు దానం చేయొచ్చని వైద్యులు సూచించారు. దీంతో తనయుడి 5 అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. వైద్యులు వెంటనే గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, రెండు కళ్లు వేరు చేసి, వివిధ ఆసుపత్రులల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికోసం గ్రీన్ ఛానల్ మార్గంలో తరలించి ఆరుగురు రోగులకు అమర్చారు. ఇలా ఆరుగురు జీవితాల్లో వెలుగు నింపి గాదె మురళీధర్- శోభ దంపతులు ఆదర్శంగా నిలిచారు. తన ప్రాణాన్ని కోల్పోయినా తమ తనయుడు ఆరుగురికి ఊపిరి పోశాడని మురళీధర్- శోభలు కన్నీటి పర్యంతం అయ్యారు.అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు తమకు దూరమవడంతో వారు గుండెలవిసేలా రోదించారు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే యుగంధర్ మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
