జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో రాములమ్మ.. అదే నండి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా నియమించబడ్డ విజయశాంతి ఎక్కడా కనపడడం లేదు.

జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో రాములమ్మ.. అదే నండి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా నియమించబడ్డ విజయశాంతి ఎక్కడా కనపడడం లేదు. రాములమ్మ ఎక్కడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అసలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అని చాలా మందికి డౌట్ రావచ్చు, ఎందుకంటే ఆమె ఏనాడు ప్రెస్ మీట్ పెట్టింది లేదు, ఒక టాపిక్ పై మాట్లాడిందే లేదు, జనం కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిందే లేదు, ఆమె అసలు గవర్నమెంట్‌ను లీడ్ చేస్తున్న అధికార పార్టీలో ఉన్నట్లా చాలా మందికి తెలియదు. అప్పుడో ఇప్పుడో ట్వీట్లు వేస్తుంటారు. కానీ జూబ్లీహిల్స్‌ ఎన్నికలపై ఎక్కడా ట్వీట్ వేసినట్లు కూడా కనపడలేదు. అంటే నెల రోజుల క్రితం సరిగ్గా అక్టోబర్ 6వ తారీఖునాడు ఒక ట్వీట్ అయితే ఆమె నుంచి వచ్చింది. ఇక అప్పటి నుంచి అంతా గప్‌చుప్. అసలు విజయశాంతికి అధిష్టానం ఆశీస్సులున్నాయని, అధిష్టానం ఆశీస్సులతోనే ఆమెకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని వార్తలు వచ్చాయి. జూబ్లీహిల్స్ స్టార్‌ క్యాంపెయినర్ల లిస్టులో విజయశాంతి పేరు వచ్చింది. స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో తన పేరున్నా కానీ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. నిన్నా మొన్నటి నుంచి సడన్‌గా ఆమె పేరు తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్‌ ఎన్నికల తర్వాత విజయశాంతికి మంత్రి పదవి వస్తుందని కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్‌కు అనుకున్న ఫలితం వచ్చేలా లేదన్న భావంతో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత సర్వేలు కూడా ఆశించిన రీతిలో లేవని హస్తం నేతలు చెబుతున్నారు. అటు మైనార్టీ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ఎం.ఐ.ఎం.తో దోస్తీ, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం వంటి చర్యలు చేపట్టినా మైనార్టీ ఓట్లు అనుకున్నరీతిలో పడేలా లేవన్న సర్వేలు వస్తున్న నేపథ్యంలో.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓటమి పాలైతే, అది పార్టీ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన ఆ ప్రభావం ఉంటుందని విశ్లేషిస్తోంది. ఇదే జరిగితే పార్టీని రెండో సారి అధికారంలోకి తేవడం అంత ఈజీ కాదన్న విషయాన్ని పసిగట్టిన పార్టీ పెద్దలు క్యాబినెట్ ప్రక్షాళన చేయడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. క్యాబినెట్ మార్పుల ద్వారా ప్రజల అసంతృప్తిని కొంచెం తగ్గించడమో, డైవర్ట్ చేయడమో చేయవచ్చన్న వ్యూహంతో పార్టీ పెద్దలు ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ ఎన్నికల తర్వాత ముగ్గురిని తప్పించి అందులో ఒకరిగా విజయశాంతికి అవకాశం కల్పిస్తారన్న కథనాలు వినపడుతున్నాయి. సౌత్ ఫస్ట్ పత్రికలో ఈ వార్త ప్రధానంగా వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను తప్పించి, ఆమె స్థానంలో విజయశాంతికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించి, ప్రస్తుత చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆ పత్రిక కథనం. సీఎంతో నేరుగా తలపడిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉద్వాసన తప్పదన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. ఆయన స్థానంలో మరో బలమైన సామాజిక వర్గం నుంచి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఇక కోమటి రెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చన్న చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. ఇంత చర్చ జరుగుతున్నా విజయశాంతి బయటకురాకపోవడం, జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం గమనార్హం.

Updated On
ehatv

ehatv

Next Story