Veturi Jayanthi: వేటూరి జయంతి సందర్భంగా.. ''పాటలూరిన వేటూరి తోట''..

ఆయనొక అక్షర తూణీరం.. అయన పాళికి రెండువైపులా పదునే.. శంకరా అంటూ స్తుతించినా.. చిలక కొట్టుడు కొట్టిన అతనికే చెల్లింది. అతడే పుంభావ సరస్వతి వేటూరి సుందరరామమూర్తి.. ముద్దుగా మన వేటూరి.

ఆ రాణి పాదాల పారాణి జిలుగులో

నీ రాజభోగాలు పాడనీ తెలుగులో

అని రాసి, తెలుగుకు ప్రాచీన హోదా లేదంటే, అదే తెలుగులో రాసిన పాటకు ఇచ్చిన జాతీయ పురస్కారం నాకు అక్కరలేదు అని తిప్పి పంపిన భాషాభిమాని వేటూరి.

సిరికాకొలను చిన్నది అనే గేయ రూపకంతో మొదలైన వేటూరి సాహితి యాత్ర, మధ్య లో ఒకటిన్నర దశాబ్దం పాత్రికేయంలో గడిపి రాటుతేలిన కలం ఓ సీత కథ సినిమాతో చిత్రసీమాలోకి ప్రవేశించి 4దశాబ్దలపాటు సినీ గేయ వాగ్గేయకారుడిగా వెలిగిపోయాడు.

పుట్టడమే పండిత కుటుంబంలో పుట్టిన వేటూరి, సంస్కృతాంధ్ర లో పాండిత్యం సంపాదించారు. అందుకే శంకరాభరణం లో

ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సితకంధరా నీలకంధరా .

క్షుద్రులెరుగని రుద్రవీణనిర్ణిద్ర గానమిది అవధరించరా

విని తరించరా. అని పండిత భాషలో రాసినా పామర జనంతో కూడా ఆహా అనిపించుకున్నాయి ఆ పాటలు.

ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే

ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది

చిలక కొట్టుడు కొడితే.. చిన్నదానా..

పలక మారి పోతావే పడుచుదానా

ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరె అరె అరె అరె

కోకెత్తుకెళ్ళింది కొండగాలీ..ఈ.. ఈ...

నువ్వు కొంటెచూపు చూస్తేనే చలి చలి.. చలి చలి లాంటి నాటు పాటలు రాసి పండితులతో కూడా వీడి అసాధ్యం కూల కవి అంటే వీడేనండి బాబు అని అనిపించుకున్న గొప్ప సినీ కవి కాగలిగాడు.

కూడ బలుక్కొని కన్నరేమో మీ అమ్మ మాయమ్మ

నీ అమ్మ నా అత్తో మాయమ్మ నీ అత్తో

దంచవే మేనత్త కూతురా

వడ్లు దంచవే నా గుండెలదరా

దంచు దంచు బాగా దంచు

అబ్బనీ తియ్యనీ దెబ్బ

ఎంత కమ్మగా ఉందిరోయబ్బా

అమ్మనీ నున్ననీ బుగ్గ

ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అని మసాలా నిండిన పాటలు రాసి మెప్పించినా అది కేవలం వేటూరికి మాత్రమే చెల్లింది. ఒక సందర్భంలో బాలుగారు వేటూరి రాసినన్ని బూతుపాటలు ఎవరు రాయలేదు, కానీ అవి బూతు అని ఎవరు అనలేరు అని చమత్కరించారు. అందుకే అంటారు వేటూరి కలానికి రెండు వైపులా పదునే అని. అంతేనా

నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన

ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన

వేదం అణువణువున నాదం

నా పంచ ప్రాణాల నాట్య వినోదం

నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై,అని రాసిన ఇందులో హంస, నంది రాగాలై అని రాసాడంటే, అతనికి సాహిత్యంతో పాటు సంగీతం పై ఎంత పట్టు ఉందొ వేరే చెప్పక్కరలేదు. మేళకర్త రాగాల ఆరోహణలు, అవరోహణలు అతనికి కొట్టిన పిండి అంటే అతిశయోక్తి కాదు అందుకే కేవీ మహదేవన్, ఎం.ఎస్‌ విశ్వనాథన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ని అవలీలగా మెప్పించి పాటంటే మా వేటూరే రాయాలి అని అనిపించుకున్నాడు.

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు... మా కులమే లెమ్మంది అంటూ సమాజాన్ని పట్టిపీడిస్తున్న కూలతత్వాన్ని ప్రశ్నించిన ధీశాలి.

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో

రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో

మరో మహాభారతం… ఆరవ వేదం

మానభంగ పర్వంలో... మాతృహృదయ నిర్వేదం.. నిర్వేదం.అంటూ స్త్రీ సమాజంపై జరుగుతున్న ఆగడాలపై కాలమెత్తి, కాలర్ ఎగరేసిన సమాజ కవి. ఇందులోనే

ప్రతి భారతి సతి మానం చంద్రమతీ మాంగల్యం

మర్మస్థానం కాదది... మీ జన్మస్థానం

అని పురాణాల పట్ల అతనికున్న నిశిత పరిశీలనని చాటి చెప్పారు వేటూరి.

వేణువై వచ్చాను భువనానికి

గాలినై పోతాను గగనానికి అని రాసుకున్నట్టుగానే శ్రీకృష్ణుని వేణు గానం లాంటి పాటలని మనకిచ్చి గాలిలా పంచభూతాలలో కలిసిపోయిన సినీ శ్రీనాధుడు వేటూరి.

మేరుసోమయాజుల ఫణి కుమార్, సీనియర్ జర్నలిస్ట్


Updated On 30 Jan 2026 12:05 PM GMT
ehatv

ehatv

Next Story