Rayalaseema Lift Project: రాయలసీమ లిఫ్ట్ వివాదం.. రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు నోరు మెదపరా..!
KCR రాజేసిన వివాదం.. 20 రోజులుగా రెండు రాష్ట్రాల్లో ఇదే అంశంపై చర్చ

రాయలసీమ లిఫ్ట్ వివాదం.. రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు నోరు మెదపరా..! అనే చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నోరుతెరచి ఎందుకు మాట్లాడడం లేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తన అనుంగు శిష్యుడు- తెలంగాణ ముఖ్యమంత్రిగా తనకు అనుకూలంగా వ్యవహరింగల ప్రీతిపాత్రుడు రేవంత్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబునాయుడిని తాను కోరితేనే ఆయన ప్రాజెక్టును ఆపాడని రేవంత్ చెప్తే ఎందుకు స్పందించలేదని విపక్షమైన వైసీపీ ప్రశ్నిస్తోంది.
వివాదం ప్రజలందరిలోనూ అనుమానాలు పుట్టిస్తుండగా.. చంద్రబాబునాయుడు మాత్రం రెండు కళ్ల సిద్ధాంతంలాగా.. రెండు రాష్ట్రాలు వివాదాల్లేకుండా నీళ్లు పంచుకోవాలని చెప్తున్నారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు చంద్రబాబునాయుడు చేసిన ద్రోహాన్ని, రేవంత్ రెడ్డి స్వయంగా బయటపెట్టిన తీరున ఎండగట్టారు. కనీసం ఇప్పుడైనా సరే.. చంద్రబాబు స్వయంగా మీడియా ముందుకు వచ్చి వాటిని ఖండిస్తారా అని వేచి చూస్తున్నారు.
క్లోజ్డ్ రూంలో చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తాను ఆపు చేయించానని.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలోనే ప్రకటించారు. అగ్గి రాజుకుంది. జగన్ సంకల్పించిన ప్రాజెక్టును చంద్రబాబు తుంగలో తొక్కేశారని వైసీపీ నేతలంతా దుమ్మెత్తి పోశారు. వారందరికీ తెలుగుదేశం మంత్రులందరూ ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు.
నిజానికి చంద్రబాబు మీద డైరక్టు విమర్శ అది. ఆయన స్వయంగా సంజాయిషీ చెప్పుకోవాల్సిన వ్యవహారం అది. కానీ ఆయన నోరు మెదపలేదు. వైసీపీలో సెకండ్ గ్రేడ్ నాయకుల ఆరోపణలకు తానెందుకు సమాధానం చెప్పాలని ఆయన అనుకున్నారో ఏమో తెలియదు. అనుచరులు మాత్రమే ప్రతిదాడులు చేస్తూ వచ్చారు.
మరోవైపు దీనికి అంతటికీ కారణం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కారణమని మరో చర్చ కూడా జరుగుతోంది. కేసీఆర్ 20 రోజుల క్రితం ప్రెస్మీట్ పెట్టి రెండు రాష్ట్రాల జలవివాదాల గురించి మీడియాకు వివరించడంతో పాటు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ ఇక పోరుబాట పడుతుందని చెప్పారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు రెండు రాష్ట్రాల్లో ఈ నిటివివాదంపైనే చర్చ జరుగుతుండడం గమనార్హం.


