Etela Rajender : కేసీఆర్‌కు బాసటగా ఈటల.. కేసీఆర్‌కు అండగా నిలవడంపై 'సీనియర్ జర్నలిస్ట్ YNR' విశ్లేషణ..!
ఈటల రాజేందర్ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నేత, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేసిన నేత

ఈటల రాజేందర్ ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నేత, తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘంగా పనిచేసిన నేత, ఆ తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు ఎనిమిదిన్నర ఏళ్ళు మంత్రిగా పనిచేసిన నాయకుడు, కేసిఆర్‌కు కుడిభుజంగా పనిచేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ సమయంలో, అసెంబ్లీలో పార్టీకి సంబంధించిన పక్షనేతగా పని చేశారు. ఈటల రాజేందర్‌కు తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉంది, ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరు ఉంది. నిజాయితీగా ఉంటారనే పేరు కూడా ఈటల రాజేందర్‌కు ఉంది. అటువంటి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు, హుజరాబాద్ ఉపఎన్నికలో గెలిచారు, ఆ తర్వాత ఆయన ప్రస్తుతం మల్కాజగిరి ఎంపీ గా ఉన్నారు, ఈటల రాజేందర్ కాళేశ్వరం అంశానికి సంబంధించి ఘోష్ కమిషన్ విచారణ ముందు హాజరయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ఏం జరిగింది, తన దగ్గర ఉన్న సమాచారాన్ని ఏంటో చెప్పారు, ఓ పక్క భారతీయ జనతా పార్టీ, మరోపక్క కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరాన్ని, కేసీఆర్ కుటుంబం ఏటీఎంలాగా వాడుకుంది. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకుంది, కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల కోసమే కట్టారు, అది కాళేశ్వరం కాదు, కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం అంటూ పదేపదే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తూ వచ్చాయి. భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కూడా కాళేశ్వరం అనేది కేసిఆర్ కుటుంబం అవినీతి కోసం కట్టిన ప్రాజెక్టు అని, అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది. కేవలం కమీషన్లు తీసుకోవడమే లక్ష్యంగా కాళేశ్వరం నిర్మాణం ప్లాన్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. అటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈటల రాజేందర్ నేను రాజకీయాల్లో ఉంటే ఉంటాను, పోతే పోతాను కానీ, ఒక మాట చెప్తాను అంటున్నారు.
10 టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట, కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్ల కోసం కట్టింది కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం కట్టింది, తెలంగాణ ప్రజల నీటి కష్టాలు తీర్చడం కోసం కట్టింది అని చెప్తున్నారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్టులు కడతారా, అదేం వాదన, ఒక పనికిమాలిన వాదన అని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా 14 ఏళ్ల పాటు, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన నిధులు ఎలాగో మనకే ఉంటున్నాయి, మన నియామకాలు ఎలాగో మనకే ఉంటున్నాయి, మన నియామకాలు ఎప్పుడు చేసినా, ఆ నియామకాలు తెలంగాణ వాళ్ళకే వస్తాయి, తప్ప ఇతర ప్రాంతాల వాళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు. మన నిధులు మన రాష్ట్రం, మన బడ్జెట్ మనమే పెట్టుకుంటున్నాం, కాబట్టి మన నిధులు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక మన నీళ్ళు మనం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, మన నీళ్ళని మనం జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది, అని భావించి నిర్మించిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు.
తెలంగాణ పల్లెల్లో నీటి కష్టాలు చూశాం, తెలంగాణ పల్లెల్లో పంటలు లేక జనాలు ఇబ్బందులు పడడం చూశాం, తెలంగాణ పల్లెల్లో వలసలు పోవడం చూశాం, వాటిని నివారించడం కోసం నీటి కష్టాలు తీర్చడం కోసం రూపొందించిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతో ఇంకేదో జరిగితే జరిగిందేమో కానీ అనే ఎక్స్క్యూస్ కూడా ఆయన తీసుకోవట్లేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనే మాట కూడా ఆయన మాట్లాడట్లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట తెలంగాణ ప్రజల కోసం కట్టింది, తప్ప కమీషన్ల కోసం కాదు మేము అది కేసీఆర్ కట్టిన ప్రాజెక్ట్ గా కాకుండా, మేము ఉద్యమంలో పని చేసిన వాళ్ళం 14 ఏళ్ళ ఉద్యమం చేసిన వాళ్ళం, ఉద్యమ సందర్భంగా తెలంగాణను చూసిన వాళ్ళం దాన్ని బాగు చేయడం కోసం ఏం చేయాలని ఆలోచన చేసిన వాళ్ళం, అలా చేసిన వాళ్ళం ప్రభుత్వంలో ఉండి ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు.ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


