Andhra Pradesh : ఏపీలో పది నెలల కూటమి ప్రభుత్వ పని తీరు పై గ్రౌండ్ రిపోర్ట్..!
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు...అధికారంలో వున్నప్పుడు ' అంతామనదే...అన్నీ మనమే' అన్నట్లుంటుంది.తీరా ఎన్నికల్లో అసలు రంగు బయటపడుతుంది.

ఏది శాశ్వతం? ఏది అశాశ్వతం? ఓ బాబు ?
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు...అధికారంలో వున్నప్పుడు ' అంతామనదే...అన్నీ మనమే' అన్నట్లుంటుంది.తీరా ఎన్నికల్లో అసలు రంగు బయటపడుతుంది.విజన్2020...అన్నవాళ్ళు ఏకంగా 9యేళ్ళు ప్రతిపక్షం లో వుండాల్సి వచ్చింది.ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 అంటూ మరో 20 యేళ్ళు అధికారం తమదేనంటున్నారు.చూడ్డానికి అంతా "పచ్చ"గానేవుంటుంది.తీరా ఫలితాలొస్తే గానీ అసలు రంగు బయటపడదు.
"పదేళ్ళకు ముందేం జరుగుతుందో ఇప్పుడే ఊహించాలి. ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.నేనైతే 2047వరకు ఏంచేయాలో ఆదేశాలిచ్చాను" అన్న బాబుగారి మాటల్ని ఎలా అర్ధం చేసుకోవాలి?. అయదేళ్ళలో కాస్త అటుఇటుగా ఏడాది గడిచిపోయింది. ఇకమిగిలింది 4 యేళ్ళు. మరో రెండేళ్ళలో జమిలి ఎన్నికలు అంటున్నారు..అదే జరిగితే మూడేళ్ళే అధికారంలో వుండేది.ఆతర్వాత పరిస్థితులు ఎలావుంటాయో చెప్పలేం.రాజకీయాలు ఎప్పుడూ ఒకలా వుండవు.
కూటమి ఐక్యత కూడా ప్రశ్నార్థకమే.. అలాంటిది విజన్ పేరుతో వర్తమానాన్ని వదిలి భవిష్యత్ ప్రణాళికలు రచించడం ఉపయోగం వుంటుందా(Just... asking)ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నీ.అలానే వున్నాయి.. ఒక్క పెన్షన్ పెంపు తప్ప.. గతప్రభుత్వం పథకాలతో పాటు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చేతులు చాచి చాచి.. అరిచి మరీ చెప్పారు..10 నెలలు దాటుతున్నా వాటి అతీగతీ లేదు.పిల్లల స్కూల్ రీయంబర్స్ మెంట్ ఇవ్వలేదు.అలాగే అమ్మ ఒడి పడలేదు.. నీకు పదిహేను. నీకు పదిహేను స్కీం అమలు కాలేదు. డ్వాక్ర మహిళలకు రాయితీలు అందలేదు.. 50 యేళ్ళుదాటిన బిసి,ఎస్సి,మైనారిటీలకు 50 యేళ్లకే పెన్షన్ అమలు కాలేదు.
ఇక ఆటోవారికి, చిన్న వ్యాపారస్తులకు, ఇంకకులాలవారీగా గత ప్రభుత్వం అందజేసిన ఆర్ధిక సాయం అందనేలేదు..ఇక స్త్రీలకు ఉచిత బస్సు ఎప్పుడో ఏలినవారేచెప్పలేకపోతున్నారు..ఊర్లలో ఈ ప్రభుత్వానికి అంత సానుకూలతేం కనిపించడంలేదు.10 నెలల్లోనేబోలెడు వ్యతిరేకత మూటకట్టుకుంది.. కూటమి ప్రభుత్వం.అయితే ఏ ప్రభుత్వమైనా ఎన్నికల్లో చెప్పింది చేసినపుడే విశ్వసనీయత పెరుగుతుంది..అలాకాకుండా కాలక్షేపం చేస్తే పరిణామాలు దారుణంగా వుంటాయి.
ఉదాహరణకు రోడ్లు వేయడం మొదలైం ది..ఇదిగుడ్ సైన్ ప్రయాణీకులకు సౌకర్యం కలుగుతోంది. అలాగే అమరావతి (Amaravati)నిర్మాణం హడావుడి ఒక సెక్షన్ వారికి ఆనందంకలిగిస్తుంటే,సంక్షేమం ఇవ్వకుండా అమరావతికి వేల కోట్లు ఎందుకు అన్నవారూ లేకపోలేదు.ఇక వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి తెలుగుదేశం జనసేన మోదీజీ మెప్పుపొందినా,రాష్ట్రంలోని ముస్లింల నుంచి టన్నులకొద్దీ వ్యతీరేకతను మూటకట్టుకున్నారు.. ఈ ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి చాటిచెప్పినట్లైంది.. అలాగే కేంద్రం ముస్లిం రిజర్వేషన్ రద్దుకు పావులు కదుపుతుంటే.బాబుగారు మాత్రం నోరు విప్పకపోవడం కూడా ముస్లింలకు నచ్చడంలేదు.రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు తక్కువేంకాదు.సుమారు 50 నియోజక వర్గాల్లో...ఎన్నికల ఫలితాలను శాసించగలరు.
ఇక సారా మాత్రం పూటుగా దొరుకుతోంది. గత... ప్రభుత్వ కాలంలో సర్కారీ షాపులముందు క్యూలు కనిపించేవి.. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేటు,షాపులు, బెల్టు షాపులే.. ధర తగ్గి స్తామన్న మాటనిలబెట్టుకోలేదని మందు బాబులకు గుర్రుగావుంది.అయితే ఏ బ్రాండైనా మార్కెట్లో దొరుకుతోందన్న..కించిత్ సంతృప్తికూడా లేకపోలేదు.ఇలా వుంటే బార్లు, స్టార్ హోటళ్ళలో బార్ లైసెన్సులు.. ఫీజుల్ని భారీమొత్తంలో తగ్గించి పెద్ద సార్లకు బోలెడు మేలు చేశారు.. వాళ్ళూ ఆ మేలు మరిచిపోకుండా ఏదో ఒకటిచేస్తారు.. అదే వేరే విషయం.
ఇక విశాఖలో పెదబాబు ఎకరా 99 పైసలకు పెద్దకంపెనీలకు కట్టబెడుతుంటే..చినబాబు మరో అడుగు ముందేసి ఎకరా 55 పైసలకే ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు..అదీ టిసియస్ లాంటి బ్రాండెడ్ కంపెనీతో పాటు.. నిన్నమొన్నటిదాకా ఊరూ పేరులేని అస్మదీయ కాగితం కంపెనీలకు....ధారాదత్తం చేస్తున్నారు. విశాఖలో వీళ్ళు అమ్ముతున్న భూములు ఎలా లేదన్న ఎకరా 100 కోట్లరూపాయల దాకా ధర వుంటుది.అంటే కొన్నివందల కోట్లవిలువచేసే ప్రభుత్వభూమిని కొన్నిపైసలకే కట్టబెడుతున్నారన్న మాట.. ఈ విషయంలో కూటమి నేతలు నోరువిప్పడంలేదుగానీ, లోలోపల మధనపడుతున్నారు.ఈ పైసల భూముల అమ్మకం ఇప్పటికే నవ్వులాటగా మారింది. రకరకాల వీడియోలు వైరల్ అవుతూ..హల్ చల్ చేస్తున్నాయి..ప్రభుత్వం కూడా నోరువిప్పక పోవడంతో రకరకాల అనుమానాలు, పుకార్లు షికారు చేస్తున్నాయి.
సరే కూటమి పార్టీల్లో ఢిషుం.. ఢిషుం.. మొదలైంది.ఆధిపత్యంకోసం మూడుపార్టీలు ఆరాటపడుతన్నాయి.అది వారి ప్రైవేటు విషయం కాబట్టి వదలేద్దాం.ఇక పాత ప్రభుత్వాన్ని, ఆ నాయకుడ్ని తిడుతూ ఎంతకాలం కాలక్షేపం చేస్తారు. పనులు కావడం లేదని కూటమి ఎమ్మెల్యేలే చట్టసభల సాక్షిగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.పాత ప్రభుత్వ తీరు సరిగా లేదనేకదా! ప్రజలు పదకొండుకు పరిమితం చేసింది.ఇదే సూత్రం కూటమికి కూడా వర్తిస్తుందన్న సంగతిని మరువరాదు.
ఓవరాల్ గా ఈ పదినెలల కూటమి ప్రభుత్వ పాలన జనాన్ని మెప్పించలేక పోయిందనే చెప్పొచ్చు.కేంద్రంలో మేమే.. రాష్ట్రంలో మేమే డబుల్ ఇంజన్ సర్కార్ అనుకొని హభుజాలు చరుచుకుంటే ఫలితంవుండదు.చెప్పిన పనులు చేసినపుడే ఏ ప్రభుత్వం పట్లనైనా ప్రజలు విశ్వాసం వుంచుతారు. మెచ్చుకుంటారు.అది జరగనపుడు ప్రజలు తిరస్కరిస్తారు.అధికారంలో వున్నోళ్ళకి అంతా మంచిగా, సాఫీగా వున్నట్లే కనిపిస్తుంది.కానీ గ్రస్ రూట్ లెవెల్ కు వచ్చిచూస్తే యదార్థం బోధపడుతుంది.గత పదిరోజులుగా ఏపిలో వివిధ ప్రాంతాలు తిరిగి ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులు పరిశీలించి రాసిన గ్రౌండ్ రిపోర్ట్ ఇది.ఎవరికినచ్చినా..నచ్చకున్నా ఆంధ్రలో యదార్ధ పరిస్థితి (గ్రౌండ్ రియాలిటీ )ఇది.
