AP High Court : లులూ సంస్థకు భూకేటాయింపు వివరాలు పెట్టండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విశాఖలో లులూ సంస్థకు భూ కేటాయింపు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

విశాఖలో లులూ సంస్థకు భూ కేటాయింపు విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పిల్‌పై విచారణను వేసవి సెలవుల తరువాతకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్(Justice Dheeraj Singh Thakur), జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖలో షాపింగ్ మాల్ ఏర్పాటుకు సంబంధించి లులూ గ్రూపునకు తక్కువ ధరకు 13.5 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోతుందంటూ పాకా సత్యనారాయణ పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది అశోక్‌రామ్ వాదనలు వినిపించారు. బిడ్లు ఆహ్వానించకుండా, సంస్థ చైర్మన్ ప్రతిపాదనల మేరకు భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(SGP) ఎస్. ప్రణతి, రెవెన్యూశాఖ ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి(KM Krishnareddy) వాదనలు వినిపిస్తూ... భూమి కేటాయింపు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
