వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం

ద్రోణి, అల్పపీడన ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి, అల్పపీడన కేంద్రం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. గత కొన్ని రోజులుగా వర్షాలు భారీగా కురుస్తూ ఉండడంతో పలు ప్రాంతాలలో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇప్పుడు మరికొన్ని రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉండడంతో ప్రజల్లో కాస్త టెన్షన్ ఉంది. ప్రభుత్వం అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించింది.


Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story