సనాతన ధర్మ(Sanathan dharma) పరిరక్షకుడిగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

సనాతన ధర్మ(Sanathan dharma) పరిరక్షకుడిగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan) వారాహి డిక్లరేషన్(Varahi declaration) సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌(Udayanidhi stalin) పేరును ప్రస్తావించకుండా ఆయనపై విమర్శలు చేశారు. 'సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా' అంటూ చాలా ఆవేశంగా అన్నారు. పవన్‌ వ్యాఖ్యలకు డీఎంకే గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. 'మా పార్టీ ఏ మతం గురంచి, ప్రత్యేకించి హిందూ మతం గురించి మాట్లాడదు. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది' అని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్‌ సయ్యద్‌ హఫీజుల్లా అన్నారు. అలాగే సెప్టెంబర్‌ 30వ తేదీన లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కూడా హఫీజుల్లా ప్రస్తావిస్తూ చంద్రబాబు, పవన్‌లను తీవ్రంగా తిట్టిపోశారు. 'పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడు, బీజేపీలే హిందూ మతం, మానవత్వానికి నిజమైన శత్రువులు ’ అని ఆయన విమర్శించారు. డీఎంకే ఏ మతం గురించి మాట్లాడదని, మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కల్యాణ్‌లేనని, వారే అసలైన శత్రువులని, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడంలో వారికి వారే సాటి అని సెటైర్లు వేశారు. 'కులం, అంటరానితనంపై అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్ ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల తరహా వైఖరినే డీఎంకే అవలంభిస్తుంది. వాటికి అనుగుణంగా కులం, అంటరానితనం గురించి పోరాడుతుంది. వ్యతిరేకిస్తుంది' అని హఫీజుల్లా వ్యాఖ్యానించారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story