Extramarital affair with lawyer: లాయర్‌తో వివాహేతర సంబంధం.. భర్తకు నానా వేధింపులు.. ఇవి తట్టుకోలేక భర్త..!

తన భార్య బాలాజీ అనే లాయర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అది కాకుండా తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ, తనను జైలుకు పంపి, ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదనకు లోనయిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన సెల్ఫీవీడియోలో తన భార్య, ఆమె ప్రియుడు తనను ఎలా వేధించారన్న విషయాన్ని వెల్లడించాడు.ఈ ఘటన ఏపీలోని నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీ అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మొదటి భార్య మృతి చెందడంతో అడవితక్కెళ్లపాడు టిడ్కో హౌస్‌లలో నివాసం ఉండే వెంకటరమణ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.

ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కూతురు లాయర్‌ డిగ్రీ పూర్తి చేసుకుని వేముల బాలాజీ అనే వ్యక్తి వద్ద ప్రాక్టీస్‌కు చేరింది. కూతురుకు ప్రాక్టీస్‌కు వెళ్తుండగా ఆమెకు తోడుగా తల్లి వెంకటరమణ కూడా వెళ్లేది. ఈ క్రమంలో లాయర్‌ బాలాజీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై వెంకటేశ్వర్లు, వెంకటరమణల మధ్య వివాదం చెలరేగింది. తరుచుగా భార్యాభర్తల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఇదేంటని నిలదీస్తే భార్య వెంకటరమణ, లాయర్‌ బాలాజీ తనపై కేసులు నమోదు చేయించి జైలుకు పంపించారని వెంకటేశ్వర్లు వాపోయాడు. తనపై కేసులు మోపటంతోపాటు తన అన్నదమ్ములు, మొదటి భార్య బిడ్డలపై కూడా అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు.

లాయర్‌ బాలాజీ అండతో తనను తన భార్య చిత్రహింసలకు గురిచేస్తోందని, తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇంటిని కొనుక్కున్నానని తెలిపాడు. ఆ ఇంటిలోకి కూడా తనను వెళ్లకుండా చేసి ఆ ఇంటిని లాయర్, తన భార్య గెస్ట్‌ హౌస్‌గా వాడుకుంటున్నారని వీడియోలో వెల్లడించాడు. గతంలో తనపై పెట్టిన కేసుల్లో జైలు నుంచి వచ్చాక రాజీ కోసం ప్రయత్నించి తన సొంత ఇంటిని అమ్మి డబ్బులు కూడా తన భార్య వెంకటరమణకు ఇవ్వడం జరిగిందని తెలిపాడు. అనంతరం మళ్లీ తనకు ఫోన్‌ చేసి రూ. 20 లక్షలు ఇస్తే డైవోర్స్‌ ఇస్తాను, తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని ఆ లాయర్, తన భార్య వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు కారణం లాయర్‌ బాలాజీ, భార్య వెంకటరమణలే కారణమని పేపర్‌పై రాసి, వీడియోద్వారా తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితులైన భార్య వెంకటరమణను అరెస్ట్ చేశారు. అయితే లాయర్ బాలాజీ మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

Updated On
ehatv

ehatv

Next Story