Trainee Constables : నూతన సంవత్సర గిఫ్ట్.. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైపెండ్ రూ.12 వేలు!
ఇకపై నెలకు రూ.12 వేలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

ఇకపై నెలకు రూ.12 వేలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ట్రైనింగ్‌లో ఉన్న కానిస్టేబుళ్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రతి నెలా చెల్లించే స్టైపెండ్ను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు నెలకు రూ.4,500గా ఉన్న స్టైపెండ్ను ఇకపై రూ.12 వేలుగా పెంచింది. అంటే ఒక్కసారిగా రూ.7,500 పెరుగుదల నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో చివరిసారిగా ట్రైనింగ్ కానిస్టేబుళ్లకు స్టైపెండ్ పెంచగా, ఆ తర్వాత గత 13 ఏళ్లుగా ఎలాంటి మార్పు జరగలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,014 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. డిసెంబరు 16న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించి శిక్షణకు పంపించారు.
ఈ సందర్భంగా ట్రైనింగ్ కానిస్టేబుళ్ల స్టైపెండ్ను రూ.12 వేలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ కావడంతో శిక్షణలో ఉన్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్ణయం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లకు గణనీయమైన ఊరట లభించనుందని అధికారులు తెలిపారు.


