ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో(AP IT Minister) సినీ నటుడు మంచు విష్ణు(Manchu vishnu) సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో(AP IT Minister) సినీ నటుడు మంచు విష్ణు(Manchu vishnu) సమావేశమయ్యారు. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్‌లో వెల్లడించారు. తన సోదరుడు, డైనమిక్ మినిస్టర్ లోకేశ్‌తో పలు అంశాలపై చర్చలు ఫలవంతంగా జరిగాయని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ సానుకూల ధృక్పదం కలిగిన వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆయనకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. హర హర మహాదేవ అంటూ ట్వీట్‌ను విష్ణు ముగించారు. అనేక అంశాలపై లోకేశ్‌తో చర్చించినట్లు పేర్కొనప్పటికీ ఏ అంశాలను చర్చించారనే విషయాన్ని ప్రస్తావించలేదు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా(Movie Artist Association) ఉండటంతో సినీ పరిశ్రమ విస్తరణపై లోకేశ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో మంచు విష్ణు మంత్రి లోకేశ్‌తో సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. కేవలం సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలు మాత్రమే వారి మధ్య చర్చకు వచ్చాయా.. రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయా అనేది తెలియాల్సి ఉంది. మంచు కుటుంబం గతంలో వైసీపీకి(YCP) కొంచెం దగ్గరగా ఉంటూ వచ్చింది. మోహన్‌బాబు(Mohan babu) పార్టీలో చేరనప్పటికీ పలు అంశాల్లో జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలపడంతో పాటు గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు సానుకూలంగా స్పందించేవారు. మోహన్‌బాబు, విష్ణు జగన్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించారన్న వార్తలు వచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత మంచు ఫ్యామిలీ స్వరం మారింది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ను మంచు విష్ణు కలవడం చర్చనీయాంశమవుతోంది.

2022లో మంచు విష్ణు అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో(YS Jagan) సమావేశమయ్యారు. సినీమా టికెట్ల ధర విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో జగన్‌ను కలిసి సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించారు. వాస్తవానికి జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా వ్యవహారించలేదనదే ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ మంచు ఫ్యామిలీతో పాటు సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు అధికార పార్టీకి తమ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లోకేశ్‌తో సమావేశం సందర్భంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారా లేదా ఇతర అంశాలపై చర్చించారా అనే స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించాలంటే ప్రభుత్వం ఆ రంగానికి చెందిన కొందరు ప్రముఖులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉండేది. కానీ, కేవలం మంచు విష్ణు ఒక్కరే లోకేశ్‌ను కలవడం చర్చనీయాంశమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడిన తర్వాత మొదటిసారి మంచు విష్ణు లోకేశ్‌తో సమావేశమయ్యారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story