ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు

ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తరలివచ్చేలా కృషి చేస్తానని పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయనకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఐదు కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని.. తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసి కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబు నాయుడికి టీజీ భరత్ ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెట్టుబడిదారులను ఆకర్షించి రాయితీలు కల్పిస్తామని టీజీ భరత్ చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ తీసుకువచ్చామన్నారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ జోన్ కూడా ఉందని.. ఎయిర్‌పోర్ట్ కూడా ఉందన్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో మాట్లాడి విజయవాడ నుంచి కర్నూలుకు విమాన సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై చర్చిస్తామని.. గత వైసీపీ ప్రభుత్వం కంటే 100 రెట్లు మంచి పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.


Updated On
Eha Tv

Eha Tv

Next Story