Crime News : రైలు నుంచి జారిపడి నవ దంపతుల మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుని నవ దంపతుల మృతి సంభవించింది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుని నవ దంపతుల మృతి సంభవించింది. పెళ్లైన రెండు నెలలకే జరిగిన ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని రావు పల్లికి చెందిన కోరాడ సింహాచలం (25)కు, అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులు హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు.విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు శుక్రవారం రాత్రి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరారు. రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన అనంతరం డోర్ వద్ద నిలబడి ఉన్న సింహాచలం, భవాని జారి కిందపడిపోయి అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


