SVSN Varma : పిఠాపురం రాజకీయం.. మరో ట్విస్ట్ ఇచ్చిన వర్మ
జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

Pithapuram TDP in-charge SVSN Varma interesting comments
జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆలోచిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. పొత్తులో భాగంగా జనసేనకు రెండు ఎంపీ సీట్లు కేటాయించగా, ఒకటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఖరారైంది. ఉదయ్ కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మిగిలిన ఒక్క ఎంపీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.
అయితే పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే, పిఠాపురం అసెంబ్లీ బరి నుంచి తాను పోటీ చేస్తానని వర్మ వెల్లడించారు. అయితే చంద్రబాబుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి సహాయ పడతానని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం శ్రమించాలని టీడీపీ నేతలను కోరారు. ‘‘వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా.. పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు’’ అని వర్మ తేల్చి చెప్పారు.
పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉన్నారు. బీజేపీ నాయకత్వం తనను ఎంపీగా పోటీ చేయమని చెప్పిందన్నారు పవన్. ఒక వేళ అమిత్‌షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తే, పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు. పవన్ కాకుండా వేరే ఎవరు పోటీ చేసినా కూడా ఒప్పుకోనని ఎస్వీఎస్ఎన్ వర్మ అంటూ ఉన్నారు.
