ముగిసిన స్కిల్‌ కేసు..! చంద్రబాబుపై స్కిల్‌ కేసు క్లోజ్..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న స్కిల్‌ స్కామ్‌ కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సీఐడీ తుది నివేదికను కోర్టులో ఫైల్‌ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. చివరకు ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’గా పరిగణిస్తూ ఈ తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు సహా 35 మందికి ఊరట దక్కింది.

ఆంధ్రప్రదేశ్‌లో 2014–2019 చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2018లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. 2023కల్లా ఈ కేసు దర్యాప్తు ముమ్మర స్థాయికి చేరుకుంది. స్కామ్‌ జరిగిన మాట వాస్తవమేనని తేల్చింది. ఫేక్‌ కంపెనీల ద్వారా సుమారు రూ.371 కోట్ల నిధులు మళ్లించబడ్డాయని నిర్ధారించింది. అలా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిందితుడిగా పేర్కొంటూ సెప్టెంబర్‌ 9, 2023లో అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కేసు దర్యాప్తులో ఉండడంతో కోర్టు బెయిల్‌ నిరాకరించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా గడిపారు. ఆ సమయంలో ఆయన్ని సీఐడీ కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది కూడా. మరోవైపు.. ఈ కేసును ఈడీ సైతం విచారణ జరిపి పలువురి ఆస్తులను సైతం జప్తు చేసింది. అనారోగ్య కారణాలు చూపిస్తూ 53 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక కేసు కొట్టేయించుకోవడానికి సీఐడీతో పిటిషన్‌ వేయించారు. గతంలో స్కిల్‌ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఏపీ సీఐడీ.. ఇప్పుడు ఇంత తీవ్రమైన కేసులో ఏమాత్రం నేరం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొనడం గమనార్హం.

Updated On
ehatv

ehatv

Next Story