ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో పైసలే పైసలు..!

ఏపీ ప్రభుత్వం సంక్రాంతి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , పోలీసు సిబ్బందికి గిఫ్ట్‌ ఇచ్చింది. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న డీఏ , డీఆర్ బకాయిలతో పాటు పోలీసుల సరెండర్ లీవుల నిధులు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మొత్తం రూ. 2,653 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసమే రూ. 1,100 కోట్లు కేటాయించారు.

ఏపీలో పనిచేస్తున్న దాదాపు 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, 2.70 లక్షల మంది పెన్షనర్లు , 55 వేల మంది పోలీసు సిబ్బందికి నేరుగా లబ్ధి చేకూరింది. పండుగపూట ఉదయమే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, పోలీసు సిబ్బందికి వారి సీనియారిటీని బట్టి ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ. 70,000 నుంచి రూ. 80,000 వరకు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు సమాచారం. పండుగ పూట ఇంత పెద్ద మొత్తం చేతికి అందడంతో, ఎంతో కాలంగా తమ బకాయిల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఊరటనిచ్చినట్లయింది. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

పోలీసు విభాగంలో పనిచేసే వారికి సరెండర్ లీవుల రూపంలో రూ. 110 కోట్లు విడుదల చేశారు. విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసులకు, పండుగ ఖర్చుల సమయంలో విడుదల చేయడంతో ఊరట దొరికింది. అలాగే పెన్షనర్లకు కూడా డీఆర్ బకాయిలు అందాయి. ప్రభుత్వం కేవలం ఉద్యోగులకే కాకుండా, గతంలో పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను కూడా క్లియర్ చేయడం ద్వారా ఆర్థిక చక్రం మళ్ళీ వేగంగా తిరిగేలా చేసింది. సంక్రాంతి వేళ ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కష్టపడిన ప్రతిపైసా ఖాతాలో పడడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story