900 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి నగరం మహానగరంగా మారాలన్న కల సాకారం కానుందన్న నమ్మకం కలుగుతుంది.

900 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి నగరం మహానగరంగా మారాలన్న కల సాకారం కానుందన్న నమ్మకం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన మహానగర ప్రతిపాదనకు తిరుపతి నగర పాలక సంస్థ ఆమోదం తెలపడంతో త్వరలోనే మహానగరంగా అడుగులు పడుతుందన్న ఆశలు బలపడుతున్నాయి.

తిరుపతి చారిత్రక నేపథ్యం

చరిత్రను తెలుసుకోవడం అంటే మన గతాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్తు నిర్ణయించుకోవడం. అది వ్యక్తి అయినా , సమాజం - ప్రాంతం అయినా ! ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి నగరానికి ఘనమైన నేపద్యం ఉన్నది. తిరుపతి నగరానికి దాదాపు 900 సంవత్సరాల చరిత్ర ఉన్నది. చారిత్రక ఆధారాలు మేరకు 1130 ఫిబ్రవరి 24 న రామానుజాచార్యుల నిర్ణయం మేరకు గోవింద రాజపురం ఆగ్రహరం నిర్మానానికి పునాది వేశారు. అంటే నేటి తిరుపతి గోవిందరాజపురంగా పునాది వేసుకుంది. అటు పిమ్మట గోవిందరాజ ఆలయం దాని చుట్టూ ఆగ్రహరం నిర్మాణం నారాయణవణం రాజ్య పాలకుడు గట్టురాజు చేపట్టారు. తర్వాత 100 సంవత్సరాలకు తిరుపతిగా రూపాంతరం చెందింది.

తిరుపతికి చుట్టూ చారిత్రక అంశాలు

తిరుపతికి తిరుమలకు విడదీయరాని అనుబంధం ఉంది. తిరుపతికి ముందే తిరుమలై ( తిరుమల ) ప్రాచుర్యం పొందింది. వెంకటేస్వరుడిని భక్తులు తమకు తోచిన రీతిలో కొలుచుకుంటారు. నేటి కొండను పురాణాలలో వెంగడం మని పిలిచేవారు. పులికాట్ పరిసరాలను పాలించిన ప్రాంతానికి వెంగో రాష్ట్రం అన్న పేరుకుడా ఉంది.

చాలా నగరాలకు చారిత్రక ప్రాధాన్యం ఉంటుంది. అనేక గొప్ప నాగరికతలు గత తీపిగుర్తులుగా మిగిలిపోతే దాదాపు 900 సంవత్సరాలు లిఖిత చరిత్ర కలిగిన తిరుపతి తీపి గుర్తుగా కాకుండా రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ మన కళ్ళ ముందు ఉంది. అలాంటి తిరుపతి త్వరలో మహానగరంగా రూపుదిద్దుకోబోతుందన్న వార్త ప్రతి ఒక్కరూ సంతోషించే విషయం.

తిరుపతి ఎందుకు మహానగరం కావాలి.

వర్తమాన ప్రపంచంలో నగరం అన్నది అభివృద్ధికి ఒక కొలమానం. విద్యా, ఉపాధి, వైద్యం ఇలా సకల సౌకర్యాలకు కేంద్రంగా నగరం ఉంటుంది. భవిష్యత్తు సమాజం నగరాల చుట్టూ ఉండబోతుంది. జాతీయ రహదారులు , అభివృద్ధి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సంస్థలు అన్నీ నగరాల చుట్టూ ప్రత్యేకించి ఆధునిక హంగులు కలిగి ఉన్న మహానగరాలలోనే ఏర్పడుతున్నాయి. శ్రీక్రిష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాయలసీమలో ఒక నగరం లేదు. ఉన్న పట్టణాలు అన్నీ గ్రామీణ స్వభావం దాటని పట్టణాలు మాత్రమే. అందుకే రాయలసీమ యువత చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు ఉపాధి కోసం, ఆధునిక ఉన్నత విద్యా, వైద్యం కోసం వెళుతున్న స్థితి. ఏపీ విస్తీర్ణంలో 40 శాతం భూభాగం ఉన్న రాయలసీమకు ఒక మహానగరం ఎంతైనా అవసరం ఉన్నది.

మహానగరం అయ్యే అవకాశం తిరుపతికి ఉన్నది.

మహానగరం కావాలి అనుకోవడం తప్పు కాదు.. సాధ్యం అయ్యే అవకాశం ఎంత మేరకు ఉన్నది అన్నది అసలు విషయం. తిరుపతి సమీపంలో చెన్నై, బెంగుళూరు నగరాలు ఉన్నాయి. రెండు నగరాలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. రెండు నగరాల అదనపు అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం తిరుపతికి ఉన్నది. 100 సంవత్సరాల తిరుపతి చరిత్రలో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు చేవిచూడలేదు. తిరుపతి నుంచి చంద్రగిరి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, నగరి, రాయలచెరువు వైపుగా పరిశీలిస్తే 2 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. చుట్టూ అడవులు ఉండటం వల్ల మంచి వాతావరణ సమతుల్యత కలిగి ఉన్న ప్రాంతం. అంతర్జాతీయ విమానాశ్రయం, దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారులు, రైలు సర్వీసులు కలిగి ఉన్నది తిరుపతి. ప్రభుత్వం నగర పరిధిని విస్తరిస్తూ రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పిస్తే అనతి కాలంలోనే మహానగరం స్థాయిని తిరుపతి అందుకుంటుంది.

నాడు వై ఎస్ ఆర్ నేడు చంద్రబాబు గార్లు ఒకే ఆలోచన కలిగి ఉండటం శుభసూచకం.

2009 ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మహానగర ఆలోచన చేశారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖ రూపుదిద్దుకుంది వారి హయంలో తిరుపతి గ్రేటర్ ఆలోచన వారి మరణంతో ముందుకు సాగలేదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని మహానగరంగా మార్చాలన్న ఆలోచన చేయడం, అందుకు అనుగుణంగా వారి ఆదేశాల మేరకు ప్రతిపాదన ప్రస్తుత తిరుపతి నగర పాలక సంస్థ కు పంపడం, నగర పాలక సంస్థ ఆమోదించడం తిరుపతి మహానగర కల సాకారం కానుందన్న నమ్మకం కలుగుతుంది.

అన్ని రకాల సాంకేతిక సమస్యలు అధిగమించి వీలైనంత త్వరగా తిరుపతి మహానగరంగా మారాలి. రాజకీయ భిన్నాభిప్రాయాలు పక్కన పెట్టి నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఆలోచనను నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకురావడం అందుకు అనుగుణంగా తిరుపతి నగర పాలక సంస్థ ఆమోదించడం మంచి పరిణామం ఈ కృషిలో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ రాయలసీమ మేధావుల ఫోరం తరపున అభినందనలు.

Updated On
ehatv

ehatv

Next Story