ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం(Narayana puram) గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురం(Narayana puram) గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త తీసుకున్న అప్పు చెల్లించలేదన్న నెపంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కర్రలతో దాడి చేసిన అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష(Shirisha) (25) అనే మహిళ భర్త తిమ్మరాయప్ప, అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప అనే వ్యక్తి వద్ద మూడేళ్ల క్రితం 80 వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించలేక తిమ్మరాయప్ప ఊరు వదిలి వెళ్లిపోయాడు. కూలీ పనులు చేసుకుంటూ తన చిన్న కొడుకును పోషిస్తున్న శిరీషను మునికన్నప్ప కుటుంబం లక్ష్యంగా చేసుకుంది. అప్పు చెల్లించాలని శిరీషతో వాగ్వాదానికి దిగిన వారు, ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్లి సమీపంలోని వేప చెట్టుకు తాళ్లతో కట్టేసి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో శిరీష తీవ్రంగా గాయపడింది. ఈ దారుణ ఘటనను చూసిన ఆమె చిన్న కొడుకు బోరున ఏడ్చాడని స్థానికులు తెలిపారు.

స్థానికులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించడంతో, కుప్పం (Kuppam)అర్బన్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిరీషను విడిపించి రక్షించారు. ఆమెను చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులైన మునికన్నప్ప, అతని భార్య వెంకటమ్మ, కొడుకు రాజా, కోడలు జగదీశ్వరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

Updated On
ehatv

ehatv

Next Story