చంద్రబాబు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు.

''చంద్రబాబు, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి, మీ టీవీ-5లు సహా మీకు కొమ్ముకాస్తున్న ఎల్లోమీడియా మరింతగా దిగజారిపోయారు. నిన్న బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నా పర్యటనకు, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, వందలమందిని నోటీసులతో నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీఛార్జి చేసినా, వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా, తమగోడు చాటుతూ హాజరయ్యారు. ప్రభుత్వ తీరుపట్ల రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు, తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని, ఈ దేశం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది నేరమన్నట్టుగా, రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగానూ, అసాంఘిక శక్తులుగానూ, దొంగలుగానూ చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ, మరోవైపు వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లోమీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడ్డం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజానమోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న తేలికతనానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబుగారు మీరు పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి? పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లోమీడియాకు సిగ్గు ఉండాలి?

2. 2.2లక్షల ఎకరాల్లో 6.5 లక్షల టన్నుల పంట, 76 వేల రైతు కుటుంబాలకు చెందిన సమస్య ఇది. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపులవద్దా, ఫ్యాక్టరీల ముందు, పండిన పంటను కొనేవాడులేక రైతులు పారబోస్తున్నారు. ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమే. మరి వీళ్లంతా మీ కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా? కష్టాల్లో ఉన్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా, ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేం రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంచేస్తే, ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు, రాస్తున్న వెకిలి రాతలు, వక్రీకరణలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు.

3. మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగి, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీదృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు... అంతేకదా చంద్రబాబుగారూ..! అంతేకాదు, అసలు వీరికి ఏ ఒక్కసమస్యాలేదని, అన్ని హామీలూ మీరు తీర్చేశారని, సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ అందుకొని ఆనందంతో వీరంతా కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం. తమకు ధరలేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా, వీళ్లందరూ అసాంఘిక శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం. ఇదేం పద్ధతి, ఇదేం విధానం చంద్రబాబుగారూ..?

4. మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే, రైతులు పంటను తెగనమ్ముకోకపోతే, మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయం పక్కనపెడితే, కిలోకు రూ.4లు ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? ఫ్యాక్టరీలు కిలో రూ.8ల చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలైనా ఎందుకు జారీచేశారు? కర్ణాటకలో కిలో రూ.16ల చొప్పున కనీస ధరకు కొనుగోలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం, మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్‌ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారుకాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్టు ఓవైపు మీరు అంగీకరిస్తూ, ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎత్తిచూపితే మళ్లీ ఈ దౌర్బాగ్యపు మాటలు, రాతలు ఏంటి? ఈ ఆంక్షలు ఎందుకు?

5. వైయస్సార్‌సీపీ హయాంలో రైతులకు ఏరోజు ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25-29ల ధర వచ్చింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి? ప్రతి ఏటా మే 10-15తేదీల మధ్య తెరవాల్సిన పల్ప్‌ ఫ్యాక్టరీలను, ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు? ఒక నెలరోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవికూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబుగారూ మీరు ఎందుకు పట్టించుకోలేదు, ఒకేసారి సరుకు వచ్చేలా చేయడంద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా? మీ గల్లా ఫ్యాక్టరీకి, మీ శ్రీని ఫుడ్స్‌కు… ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడంలేదంటారా? మీరు ఇస్తానన్న రూ.4లు ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8ల చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? ఇదికూడా నిరుడు సంవత్సరం వైయస్సార్‌సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29ల రేటు, ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్న రూ.2.5/3లు కేజీకి. దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్షనేతగా, రైతుల పక్షాన నిన్న బంగారుపాళ్యంలో నేను చేస్తే, మీ దగ్గర సమాధానాలు లేక రైతులు మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?

6. చంద్రబాబుగారూ.. మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి… ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడంలేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే, డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్చిరైతులకు ధరలు రావడంలేదని గగ్గోలు పెడితే, కేంద్రంచేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టారా? టొబాకో రైతులు ఆందోళన చేస్తే, ఇంకో డ్రామా చేస్తూ, ప్రకటనలు చేయిస్తున్నారు. చిత్తశుద్ధితో మీరు వ్యవహరించారా?

7. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పనిచేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్బీకేల్లో రియల్‌ టైం మానిటరింగ్‌ చేసే CM APP ఏమైంది?

8. గత ఏడాది మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20వేలు ఇవ్వలేదు, జూన్‌ 21 ఇస్తానని చెప్పి, జులై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ, ఈ ఏడాదికూడా దాని గురించి ప్రస్తావించడంలేదు. సీజన్‌ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్యగోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.

9. వరదలు వచ్చినా, కరువులు వచ్చినా సమయానికే సీజన్‌ ముగిసేలోగా ఇచ్చే ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు. ఉచిత పంటలబీమాను పూర్తిగా ఎత్తేశారు, ఆర్బీకేలను, ఇ-క్రాప్‌ విధానాన్ని, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. ఇలా ప్రతిదశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎత్తిచూపితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి''

ehatv

ehatv

Next Story