ఓ మోసగాడు మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా వైద్యురాలితో పరిచయం పెంచుకున్నాడు.

ఓ మోసగాడు మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా వైద్యురాలితో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుందాం అంటూ వైద్యురాలిని నమ్మించాడు. తమ బ్యాంక్ అకౌంట్స్ ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసిందని మభ్యపెట్టాడు. ఆ వైద్యురాలు ఇతను చెప్పిన కల్లబొల్లి కబర్లని నిజమేనని నమ్మింది. అడ్డంగా మోసగాడి చేతికి చిక్కింది. ఈ వ్యవహారం చివరకు పోలీసుల దాకా వెళ్లింది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా మోసం పోవడం కొసమెరుపు. తాజాగా హైదరాబాద్ ఓ లేడీ డాక్టర్ ఆ తరహా ఉచ్చులో పడి మోసపోయింది. దాదాపు 11 లక్షలు పోగొట్టుకుంది. చివరకు తాను మోసపోయానని భావించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌లో ఉంటున్న 31 ఏళ్ల వైద్యురాలు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో తన ప్రొఫైల్ ఇచ్చింది. అయితే నిర్వాహకులు ఓ వ్యక్తికి చెందిన వివరాలు అందజేశారు. ఆమె నెంబర్‌ను ఆ మోసగాడికి ఇచ్చారు. ఇద్దరూ సంబంధం గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అంటే జనవరి 30 నుంచి వారిద్దరూ వాట్సాప్ చాటింగ్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడి నుంచే అసలు తతంగం మొదలైంది. తన తల్లి చికాగోలోని నార్త్ వెస్టర్న్ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుందని ఆమెకు చెప్పాడు. తమ కుటుంబానికి పెద్ద వ్యాపారాలు ఉన్నాయని చెప్పాడు. త్వరలోనే తన తల్లి ఇండియాకు వస్తుందని, మన పెళ్లి గురించి ఫైనల్‌గా మాట్లాడుకుందామని చెప్పాడు. ఇది విన్న వైద్యురాలు నిజమేనని నమ్మింది. తమ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిందని.. కొంత డబ్బు కావాలని అడిగాడు. తన పాన్ కార్డు విషయంలో కొంత గందరగోళం ఉందని ఆదాయపన్ను శాఖ అధికారులు తన బ్యాంకు ఖాతాను సీజ్ చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. తనకు కొంత నగదు సహాయం చేస్తే తిరిగి ఇస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన వైద్యురాలు పలు దఫాలుగా రూ.11 లక్షల వరకు ఇచ్చింది. ఈ నెల 21న తన తల్లి అమెరికా నుంచి వస్తున్నదని పెళ్లి విషయం మాట్లాడుకుందాం అని చెప్పాడు. కానీ అతని తల్లి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు అతడిని నిలదీసింది. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో తన నిజ స్వరూపాన్ని బయట పెట్టిన హర్ష డబ్బులు అడిగితే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. ఫొటోలు వైరల్ కాకుండా ఉండాలంటే మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
