తనకు ఈ హత్య కేసులో సంబంధం లేదన్న ప్రియురాలు

గతేడాది బెంగళూరులో సంచలనం రేపిన మహిళా వైద్యురాలు డాక్టర్ కృతికా రెడ్డి (28) హత్యకేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రియురాలి కోసం భార్య కృతికాను హత్య చేసిన మహేంద్రరెడ్డికి, అదే ప్రియురాలు ఆయనకు షాక్ ఇచ్చింది. పోలీసుల ముందు వ్యతిరేకంగా మాట్లాడింది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
కృతికారెడ్డి గతేడాది ఏప్రిల్ నెల 23న అనుమానాస్పదంగా మరణించారు. విచారణ చేపట్టిన పోలీసులు 2,322 పేజీల ఛార్జ్ షీట్‌ను నమోదు చేసి కోర్టుకు అందించారు. మారతహళ్లి పోలీసులు తీగలాగితే డొంకంత కదిలింది అన్న చందంగా కృతికారెడ్డి మరణించక ముందు ఏం జరిగిందో చెప్పాలంటూ డాక్టర్ మహేందర్‌రెడ్డి నుంచి వాగ్మూలం తీసుకున్నారు.
ఆ వాంగ్మూలంలో ‘ఏప్రిల్ 23వ తేదీ రాత్రి నేను నా భార్యకు క్యాన్యులా (ఇంట్రావీనస్ పైపు) ద్వారా మందు ఇచ్చాను. మేము అర్ధరాత్రి నిద్రపోయాము. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో నేను నిద్రలేచి క్యాన్యులాను తీసేశాను’అని డాక్టర్ మహేంద్ర రెడ్డి పేర్కొన్నారు. అంతే ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భర్తే హంతకుడు అని నిర్ధారించేందుకు మొత్తం ఐదు రకాల ఆధారాలు, కారణాల్ని గుర్తించారు.
ఇందుకోసం 23 డాక్టర్లతో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు,స్నేహితులు, సాక్షులు ఇలా 77 మంది నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వాటి ఆధారంగా 2,322 పేజీల ఛార్జ్ షీట్‌ను కోర్టుకు అందించారు. విచారణ చేపట్టిన కోర్టు ఛార్జ్ షీట్‌లో 77మంది స్టేట్మెంట్, సేకరించిన ఆధారాలు,కారణాలు ఆధారంగా భర్తే హంతకుడని న్యాయస్థానం తేల్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరుఫు న్యాయవాది ప్రసన్న కుమార్ కోర్టులో తన వాదనల్ని వినిపించారు.
‘ప్రియురాలి కోసమే తన భార్యను హత్య చేసినట్లు చెప్పుకొచ్చాడు. కానీ సదరు ప్రియురాలు మాత్రం ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొట్టి పారేసింది. దీంతో ‘నేను ఎప్పటికీ హంతకుడిగానే ఉంటాను, నువ్వు సంతోషంగా జీవించు’ అని ప్రతిస్పందించాడు”. ఈ సందేశాలు నిందితుడి ఉద్దేశాన్ని, ప్రేరణను స్పష్టంగా చూపడమే కాకుండా, అతని నేరాన్ని ఒప్పుకున్నట్లుగా ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. తన వివాహేతర సంబంధానికి డాక్టర్ కృతికారెడ్డి అడ్డుగా ఉందనే ఆమె భర్త డాక్టర్ మహేంద్రరెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలితో సాన్నిహిత్యం కోసమే భార్యను హత్య చేశాడు.


