సైబర్ నేరస్తులు రోజురోజుకూ మోసాల్లో ఆరితేరుతున్నారు. కొత్తకొత్త మోసాలతో జనాలను నిండా ముంచేస్తున్నారు.

సైబర్ నేరస్తులు రోజురోజుకూ మోసాల్లో ఆరితేరుతున్నారు. కొత్తకొత్త మోసాలతో జనాలను నిండా ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘరానా మోసం ఒకటి హైదరాబాద్ లో బయటపడింది. ఓ ట్రావెల్ కంపెనీ వెబ్ సైట్ లో చిన్న లోపాన్ని గుర్తించిన కేటుగాళ్లు.. దానిని అవకాశంగా మలుచుకుని సదరు కంపెనీ డిజిటల్ వాలెట్ లోని సొమ్ములో నుంచి రూ.3 కోట్లను కొట్టేశారు. అమ్మిన టికెట్లకు వచ్చిన ఆదాయానికి అస్సలు పొంతనే లేదని నిర్వాహకులు అంతర్గతంగా ఆడిట్ నిర్వహించగా ఈ మోసం బయటపడింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు జరిపిన సైబరాబాద్ పోలీసులు ఈ మోసానికి పాల్పడిన చెన్నుపాటి శివన్నారాయణ, కడలి నారాయణస్వామి, అనుగుల రాజ్‌కుమార్, జడ్డ బ్రహ్మయ్య, పెరిచెర్ల వర్మను అదుపులోకి తీసుకున్నారు.
మోసం జరిగిందిలా..
ఓ ప్రముఖ ట్రావెల్ కంపెనీ సైట్ లో సైబర్ నేరస్తులు లాగిన్ అయి డిజిటల్ వాలెట్ లో డబ్బు జమ చేశారు. ఆపై టికెట్ బుక్ చేసి క్షణాల వ్యవధిలోనే రద్దు చేసేవారు. దీంతో టికెట్ బుకింగ్ కు సంబంధించి కస్టమర్ ఖాతాలో నుంచి డబ్బు కట్ అయ్యేది కాదు. అయితే, టికెట్ రద్దు చేసిన మెసేజ్ తో పాటు ఆ టికెట్ సొమ్ము కూడా కస్టమర్ ఖాతాలో జమయ్యేది. ఈ ఏడాది మే నుంచి జులై వరకు.. 3 నెలల్లో ట్రావెల్ కంపెనీ డిజిటల్ వాలెట్ నుంచి ఏకంగా 3 కోట్లకు పైగా నగదు కాజేశారు. ఈ మోసంలో సదరు ట్రావెల్ సంస్థ ఏజెంట్ల హస్తం కూడా ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది


