నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో ఓ తండ్రి తన ముగ్గురు చిన్నారులను హత్య చేసి, అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

గ్రామస్థుల సమాచారం మేరకు, వేములపాటి సురేంద్ర (35) తన ముగ్గురు పిల్లలకు విషం కలిపిన పాలను తాగించాడు. కొద్ది సేపటిలోనే పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. అనంతరం సురేంద్ర కూడా అదే విషాన్ని తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనలో మృతి చెందిన వారు కావ్యశ్రీ (7), ధ్యానేశ్వరి (4), సూర్య గగన్ (2)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సురేంద్ర భార్య మహేశ్వరి (32) గతేడాది ఆగస్టు 16న అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. భార్య మృతి తర్వాత పిల్లల బాధ్యత ఒంటరిగా మోయలేక, మానసిక ఒత్తిడికి గురైన సురేంద్ర ఈ ఘోరానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో తుడుములదిన్నె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story