Husband Killed Wife: అనుమానంతో భార్యను రోకలి బండతో కొట్టి చంపి.. నా భార్యను నేనే చంపుకున్నా అని స్టేటస్ పెట్టి..!

అనుమానంతో భార్యను రోకలి బండతో కొట్టి చంపిన సంఘటన హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా చింతకుంటకు చెందిన రొడ్డె ఆంజనేయులుకు కొల్లాపూర్‌కు చెందిన సరస్వతితో 14 ఏళ్ల కింద వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కూతురు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చిను కుటుంబం రహమత్నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ నగర్‌లోని ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఆంజనేయులు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో పాటు కొంతమందితో కలిసి జూబ్లీహిల్స్‌లో కార్ల క్రయవిక్రయాల వ్యాపారం చేస్తున్నాడు. సరస్వతి హైటెక్ సిటీ ప్రాంతంలోని ఒక కంపెనీలో హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్య సరస్వతిపై అనుమానం పెంచుకున్న ఆంజనేయులు తరుచూ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోన్ తీసుకొని అన్నీ పరిశీలిస్తూ, ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లి ఏం చేస్తుందని గమనించేవాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య గొడవలు పెరిగాయి. ఉద్యోగం మానేసి జులాయిగా తిరగసాగాడు. సరస్వతి పలుమార్లు జాబుకు వెళ్లాలని సూచించినా ప్రయోజనం లేకపోయింది. ఫీజుకు డబ్బులు లేకపోవడంతో పిల్లలను సైతం స్కూల్‌కు పంపడం మాన్పించేశారు. అయినా ఆంజనేయులు బుద్ధి మారకపోవడంతో నీతో బతకలేనంటూ ఇటీవల పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆంజనేయులు తన అత్తగారింటికి వెళ్లి, భార్య తరఫు పెద్ద మనుషులతో మాట్లాడి, గొడవలు పెట్టుకోనని నచ్చజెప్పి ఈనెల 17న భార్య, పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. సోమవారం విధులు ముగించుకొని వచ్చిన సరస్వతి.. పిల్లలకు భోజనం పెట్టి పడుకుంది.
సోమవారం అర్ధరాత్రి తన పిల్లలతో కలిసి గాఢనిద్రలో ఉన్న సరస్వతి తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే నిద్రపోయిన పిల్లల దుస్తులు సైతం రక్తంతో తడిసిపోయాయి. ఆ సమయంలో వారిద్దరూ నిద్రలేవడంతో.. అమ్మ పడుకుంది.. మీరు నిద్రపోండి అని ఆంజనేయులు బయటికి వెళ్లిపోయాడు. ఆ వెంటనే భయంతో పిల్లలు నిద్రలేచి లైట్ వేసి తల్లి రక్తపుమడుగులో పడి ఉండటాన్ని చూశారు. వెంటనే సమీపంలో ఉంటున్న మేనమామ సుధాకర్ ఫోన్‌చేసి చెప్పారు. ఆయన అక్కడికి చేరుకొని 100కు సమాచారం అందించారు.హత్య అనంతరం ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆంజనేయులు హత్య చేసిన అనంతరం తన స్టేటస్‌లో -నా జీవిత భాగస్వామిని నేనే నా చేతులారా చంపుకున్నా- అంటూ ఫొటో స్టేటస్ పెట్టుకోవడం గమనార్హం.


