తన మాజీ ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లాడిందని, తన మాజీ ప్రియురాలిని మర్చిపోలేకపోతున్నానని, ఆమెను తిరిగి దక్కించుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.

తన మాజీ ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లాడిందని, తన మాజీ ప్రియురాలిని మర్చిపోలేకపోతున్నానని, ఆమెను తిరిగి దక్కించుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. వశీకరణ పూజల కోసం మంత్రగాడిని ఆశ్రయించాడు. అయితే మరింత డబ్బు డిమాండ్‌ చేసిన మంత్రగాడు ఆ వ్యక్తిని హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అర్షద్‌పూర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల రాజాబాబు ప్రియురాలికి ఏప్రిల్‌లో మరో వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే ఆమెను తిరిగి తన వద్దకు రప్పించుకునేందుకు నీలు అనే మంత్రగాడిని ఆశ్రయించాడు. వశీకరణ పూజల కోసం తొలుత రూ.36,000 ఆ తర్వాత రూ.1.5 లక్షలు చెల్లించాడు.

గత నవంబర్‌ 24న వశీకరణ చివరి పూజల కోసం మంత్రగాడు నీలు తన గ్రామమైన శివ్లికి రాజాబాబును రప్పించాడు. ఆ రోజు సాయంత్రం మద్యం కొనుగోలు చేసిన తర్వాత వారిద్దరూ సమీపంలోని పొలం వద్దకు వెళ్లారు. అక్కడ మంత్రగాడు నకిలీ వశీకరణ పూజలు చేశాడు. ఒక పేపర్‌పై మాజీ ప్రియురాలు, అతడి పేరు, ఇతర వివరాలు రాయించాడు. ఆ తర్వాత రాజాబాబును మరింత డబ్బు డిమాండ్‌ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మంత్రగాడు నీలు కత్తితో అతడి ఛాతిపై పొడిచి చంపాడు. ఆ కత్తిని రాజాబాబు చేతిలో ఉంచాడు. మాజీ ప్రియురాలి ఫొటో, అతడితో రాయించిన పేపర్‌ను మృతదేహంపై ఉంచాడు. ఆమె కోసం అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించాడు.

మరోవైపు నవంబర్‌ 25న శివ్లిలోని మజార్ సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతిడిని రాజాబాబుగా గుర్తించారు. అక్కడ మద్యం ప్యాకెట్‌ పడి ఉండటంతో ఎవరో హత్య చేసినట్లు పోలీసులు అనుమానించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. రాజాబాబుతో కలిసి మంత్రగాడు నీలు ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో మంత్రగాడు నీలును అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated On
ehatv

ehatv

Next Story