టీటీడీ పరకామణి కేసులో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి చర్చనీయాంశమైంది.

టీటీడీ పరకామణి కేసులో సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి చర్చనీయాంశమైంది. ఈ కేసులో అత్యంత కీలకమైన అప్పటి టీటీడీ ఏవీఎస్వో, ప్రస్తుత జీఆర్పీ సీఐ వై.సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలున్నాయి. ఇది హత్యనా, ఆత్మహత్యనా అనేది చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సతీశ్ కుమార్‌ను పోలీసు ఉన్నతాధికారులు వేధించారన్న ఆరోపణలున్నాయి. ఆయన మృతి అనంతరం పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు సందేహాలను మరింత బలపరుస్తోంది. అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకుండా పోలీసు ఉన్నతాధికారులు సతీశ్ కుమార్‌ది హత్యేనని మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం. తద్వారా ఈ అంశాన్ని కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులకు అనుగుణంగా వక్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.
వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వలేనని సతీశ్‌కుమార్ తేల్చిచెప్పిన తరువాత పరిణామాల్లోనే.. ఆయన శుక్రవారం అనుమానస్పదంగా మృతి చెందడం గమనార్హం. గుంతకల్‌లో గురువారం అర్ధరాత్రి 12.45 గంటలకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ సెకండ్ ఏసీ బోగీలో రైలు ఎక్కిన సతీశ్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైలు పట్టాలపై సతీష్ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
అయితే ఈ విషయంపై సతీశ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎవరితోనూ మాట్లాడకుండా పోలీసు అధికారులు కట్టడి చేశారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సతీశ్ కుమార్ భార్య ఫోన్‌నూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రికీ ఆమె ఫోన్‌ను తిరిగి ఇవ్వనే లేదు. బాధిత కుటుంబం తమ ఆవేదనను ఎవరితోనూ పంచుకునేందుకు.. ఆయన మృతిపై తమ సందేహాలను వెల్లడించేందుకూ అవకాశం ఇవ్వకుండా పోలీసులు కట్టడి చేసినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తమ ప్రాథమిక నివేదికలో ఏమని తెలిపారో అధికారికంగా వెల్లడించలేదు. సతీశ్ కుమార్ మృతికి కారణమేమిటన్నది చెప్ప లేదు. కానీ శుక్రవారం రాత్రి 7 గంటల నుంచే తమ అనుకూల మీడియాలో సతీష్‌కుమార్‌ది హత్యేనని లీకులు ఇచ్చారని తెలుస్తోంది. సతీశ్ కుమార్‌ది హత్యేనని టీడీపీ అధికారిక వెబ్సైట్ శుక్రవారం రాత్రి 7.30గంటలకే పోస్టు చేసింది. మరి కొన్ని వెబ్సైట్లలో కూడా సతీష్‌ది హత్యేనని రాసుకొచ్చారు. పోలీసులు అధికారికంగా ప్రకటించకుండా మీడియాకు ఎలా తెలిసిందనేది ప్రశ్నార్థకంగా మారింది.


