కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామంలో హత్య జరిగింది.

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామంలో హత్య జరిగింది. ఇద్దరు యువకులు అనుమానంతో అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని హత్య చేసి భూమిలో పాతిపెట్టారు. సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పోలీసులు వివరించారు. పి.వేమవరానికి చెందిన యువతి అదే గ్రామానికి చెందిన నొక్కు కిరణ్‌కార్తిక్ (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆ యువతి అన్నయ్య నూతలకట్టు కృష్ణ ప్రసాద్ అడపాదడపా గ్రామానికి వచ్చినపుడు తన చెల్లి ఎవరితోనో మాట్లాడుతోందన్న విషయం తెలుసుకున్నారు. దీంతో కార్తిక్‌ను మందలించాడు. తన చెల్లెలను బాగా చదివించాలనుకుంటున్నానని ప్రేమకు దూరంగా ఉండాలని కోరాడు.
అయినా కపరిస్థితిలో మార్పు రాకపోవడంతో కృష్ణ ప్రసాద్ తన స్నేహితుడు దూలపల్లి వినోద్ సాయంతో కార్తిక్‌ను పిలిచి పని ఉంది మాట్లాడదామంటూ తీసుకువెళ్లారు. అతడిని అచ్చంపేట శివారు బ్రహ్మానందపురంలోని జగనన్న లేఅవుట్‌కు తీసుకువెళ్లి అతడితో ఘర్షణపడి కొట్టి హత్య చేసి గోతిలో పూడ్చి పెట్టారు. ఆ తర్వాత కృష్ణప్రసాద్ హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా గతనెల 24వ తేదీనే ఉప్పాడలోని వెల్డింగ్ దుకాణంలో పనిచేస్తున్న కార్తిక్, అతని తండ్రి వెంకటరమణల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. కూలీలకు సొమ్ములిచ్చే విషయంలో తేడా రావడంతో కార్తిక్‌ను అతని తండ్రి మందలించాడు. దీంతో కార్తిక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ముద్దుగా చదివించుకుంటున్న తన చెల్లిని మోసం చేస్తాడనే అనుమానంతో హత్య చేసినట్లు కృష్ణప్రసాద్ చెప్పాడని సీఐ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నిందితులను ఘటనా ప్రదేశానికి తీసుకువెళ్లి మండల మెజిస్ట్రేట్, తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు జి.నాగేశ్వరరావు, వై.ముసలయ్య, ఎం.పృథ్వి, సీహెచ్ ప్రసాద్, బాబీ, రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదృశ్యం కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
