Antarvedi festivals: అంతర్వేది ఉత్సవాల ప్రత్యేక కథనం..! దేవతలందరికీ అధిపతి అయిన దేవేంద్రుడు కుమారుడికి జరిగిన చేదు అనుభవం ఏంటి..!

దేవతలందరికీ అధిపతి అయిన దేవేంద్రుడు కుమారుడికి దైవ శక్తులు ఎలా పోయాయి. అంతర్వేదిలో నరసింహ స్వామి వారిని అర్చించి, అన్నదానం చేయడం వలన పోయిన దైవ శక్తులు ఎలా వచ్చాయి అనే ఆసక్తికర, ఎవరికీ తెలియని చరిత్రను ఈ కథనంలో తెలుసుకుందాం.
పూర్వము అంతర్వేది క్షేత్రమును “రుచి” అని పూల మాలలు గుచ్చి అమ్మే వ్యక్తి, స్వామి పుష్పవనమున తులసి జాజి-మల్లి, గులాబి, పొగడాల వంటి పూల మొక్కలను పెంచుతూ వనరక్షణకై తోట చుట్టు ఎత్తయిన ప్రాకారం నిర్మించి తాను బయటకు పోవు సమయంలో తన కుమారుని, వన పరిరక్షకునిగా ఉంచుతూ రాత్రింబవళ్ళు ఆ పూల వనమును ప్రేమతో పెంచాడు.
సుగంధ పుష్ప... ఫల భరితమైన ఆ వన సౌందర్యము కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందింది. ప్రతిదినము “రుచి” భార్య సమేతుడై తోటలోని పూలను కోసి మాలలు కూర్చి, కొన్నిటిని నరసింహ స్వామివారికిభక్తి శ్రద్ధలతో సమర్పించి మిగిలినవి అమ్ముకొని జీవన యాత్ర సాగించారు.
ఆ వన సౌందర్యానికి ఆకర్షితుడైన దేవేంద్రుని కుమారుడైన జయంతుడు అప్సర కన్యలతో గూడి, గగన మార్గమున తన రథంపై ప్రతీ రోజు వచ్చి తోటను ప్రవేశించి, పూలను కోసుకొని వెళ్లేవారు.
ఎంతో దుర్లభమైన ప్రాకారమును నిర్మించిననూ, నిత్యమూ పూలు మాయం కావడంపై కారణాలను తెలుసుకోవడానికి “రుచి” అప్రమత్తుడై, పూల తోటకు కావలిగా ఉండగా, యధావిదిగా దివ్యరధముపై వచ్చి 'పూలను కోసుకొని, వెళ్ళిపోతున్న జయంతుని చూసి, నిస్సహాయంతో నరసింహ స్వామిని ధ్యానించాడు.
భక్త జన రక్షకుడగు ఆ అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి“రుచి”కి ప్రత్యక్షమై "భక్తా ! నా నిర్మాల్యములను ( స్వామికి పూజ చేసి తీసివేసిన పుష్పాలను నిర్మాల్యం అంటారు. ) ప్రాకారము చుట్టూనూ ఉంచిన తర్వాత కూడా జరిగే చిత్రము చూడు అని స్వామి చెప్పాడు.
జయంతుని పట్టుకునేందుకు వేరుమార్గము లేదు” అని మాయమయ్యేను. “రుచి” మేల్కొని, స్వామి కృపకు మనస్సున అంజలి ఘటించి మరునాడు స్వామి ఆదేశించిన ప్రకారము, తోట చుట్టూ, నిర్మాల్యములు వెదజల్లెను.
జయంతుడు ఎప్పటివలెనే, తోటయందు ప్రవేశించి, పరిమళ పుష్పములు కోసికొని తిరిగి వెళ్లేందుకు రథం వరకు చేరుకోగా తన దివ్యత్వమును కోల్పోయెను. జయంతుడు తన దుస్థితిని రధసారధికి తెలుపగా స్వామివారి నిర్మాల్యములు దాటడంతో ఈ అనర్ధము కలిగిందని, ఇక భూలోకమే శరణ్యమని సారథి స్వర్గానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.జయంతుడు తన దోషమునకు పరిహారము సూచించమని కోరగా,
""అంతర్వేది పుణ్యక్షేత్రమున పన్నెండు సంవత్సరములు సత్రయాగము చేసి ,నిత్యం అన్న దానాలు చేస్తే దైవత్వము లభిస్తుందని చెప్పి, సారధి రధముపై స్వర్గమునకు వెళ్లిపోయాడు.
జయంతుడు తాను కోల్పోయిన దైవత్వము సాధించుకొనుటకై దోష నివారణార్ధము అంతర్వేది క్షేత్రమున త్రికాలమందునూ స్వామిని ధ్యానిస్తూ, సారధి చెప్పినట్లు యధాతధముగా ఆచరించగా కొందరు బ్రాహ్మణులు జయంతుని 'ఏకోరిక మేరకు ఇట్లు చేస్తున్నారని ప్రశ్నించగా జరిగిన విషయము పూసగుచ్చినట్లు వారికి నివేదించి, నమస్కరిస్తాడు. అతడి భక్తి శ్రద్ధలకు సంతోషించి, స్వామి వారు శుభము కలుగునని ఆశీర్వదించారు. ఆ ప్రభావముతో జయంతునకు కోల్పోయిన దివ్యశక్తి తిరిగి లభించినది. జయంతుడు ఆనందముగా స్వామి వారికి నమస్కరించి, రథం ఎక్కి స్వర్గానికి వెళ్లాడు.
అంతటి మహిమాన్వితమైన అంతర్వేది క్షేత్రం లో స్వామి వారికి జరిగే కల్యాణ మహోత్సవాల్లో స్వామి వారిని దర్శిస్తే స్వామి వారి కరుణా కటాక్షాలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని పురాణాలు తెలుపుతున్నాయి.


