అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 6.55 గంటల నుంచి 7.25 గంటల వ‌ర‌కు మిథున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. అంతకుముందు ఉదయం 6.20 గంటల నుంచి 6.55 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి, శ్రీవారి మాడ వీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తర్వాత ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం జరిగింది. సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పెద్ద శేషవాహన సేవ వైభవంగా జరుగనుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story