వైఎస్సార్ కడపజిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

వైఎస్సార్ కడపజిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో మొదటి రోజు ఆలయ ఆవరణలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీకృష్ణుడు, గోదాదేవి ఉత్సవమూర్తులను కోలువుతీర్చి తులసి, పుష్పమాలలతో అలంకరించి పాలు, తోనె, కొబ్బరి నీరు పసుపు, గంధం, సుగంధం, పరిమళంతో సహస్రధారాభిషేకం చేశారు. అనంతరం ధూప దీప నివేదన, కర్పూర హారతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం సాయంత్రం ప్రత్యేక తిరుచ్చిపై శ్రీకృష్ణుడు, గోదాదేవి ఉత్సవమూర్తులను కోలువుదీర్చి బంగారు ఆభరణాలు పుష్పమాలలతో అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుండి పుష్కరిణి వరకు ఉరేగింపుగా తీసుకొచ్చారు. పుష్కరిణిలో తెప్పపై శ్రీకృష్ణుడు, గోదాదేవిని కొలువుదీర్చి బంగారు అభరణాలు, పుష్ప మాలలతో అలంకరించి వేద పారాయణం, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత కచేరి, హరికథాగానం, కోలాటాలు భక్తులను విశేషంగా అలరించాయి.
కాగా, పుష్కరిణిలో మే 11న ఐదు చుట్లు, మే 12 ఏడు చుట్లు విహరిస్తూ స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిటిడి అధికారులు, ఆలయ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
