శివాలయాలు నిత్యం తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాయి.

శివాలయాలు నిత్యం తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాయి. భక్తులు మహాశివుడిని, శివలింగాన్ని పూజిస్తుంటారు. తమకు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే ఆరోజు వెళ్లి పూజిస్తారు. కానీ మధ్యప్రదేశ్లోని ఓ శివాలయంలో మాత్రం ఏడాదికి మూడో రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ మూడు రోజులు మాత్రమే స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో చందేల్ కాలం నాటి చేతిపనులకు, శిల్పకళలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఖజురాహో ఆలయంతో పాటు, మాల్థోన్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో రెహ్లి సూర్య దేవాలయం, పాలిలోని హజారియా శివాలయం ఇక్కడ నిర్మించి ఉన్నాయి. అయితే హజారియా ఆలయం' చందేల్ కాలంలోని కళా నైపుణ్యానికి చక్కటి ఉదాహరణ. ఈ ఆలయాన్ని పదో శతాబ్దంలో నిర్మించారని శాసనాలు చెప్తున్నాయి. ఇక్కడ శివుడిని 'హజారియా మహాదేవ్' అని భక్తులు పిలుస్తారు. అక్కడ ఉన్న శివలింగాన్ని పూజిస్తే వెయ్యికి పైగా లింగాలను పూజించిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే ఈ ఆలయాన్ని భక్తులు ఏడాదికి కేవలం మూడు సార్లు మాత్రమే సందర్శించగలరు. ఎందుకంటే ఆ ఆలయం చారిత్రక ప్రాముఖ్యం కారణంగా పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో ఉంది. కాబట్టి ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. శివరాత్రి, శ్రావణ సోమవారం, కార్తీక పూర్ణిమ రోజుల్లో మాత్రమే ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఈ మూడు రోజుల్లో శివుడిని దర్శించుకునేందకు భక్తులు పోటీలు పడుతుంటారు.
