ఇక సంక్రాంతి శాస్త్రపరంగా కూడా చాలా ప్రత్యేకత ఉంది. సాధారణంగా నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి.

ఇక సంక్రాంతి శాస్త్రపరంగా కూడా చాలా ప్రత్యేకత ఉంది. సాధారణంగా నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజించారు. తిరిగి 108 పాదాలని 12 రాశులుగా విభజించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు.అలాగే సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు అ రాశిని మకర సంక్రాంతి అని అంటారు. ఈ మకర సంక్రాంతి రోజు దానధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల బాధలు అంటవని ఓ నమ్మకం. సంక్రాంతి సమయంలో పంటలు చేతికి వస్తాయి, గొబ్బెమ్మలు పెట్టి లక్ష్మిని ఆహ్వానిస్తారు. పెళ్లికాని అమ్మాయిలు గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తే, కోరుకున్న వారు భర్తగా వస్తారని, త్వరగా పెళ్లి అవుతుందని నమ్ముతారు. గొబ్బెమ్మలను గోదాదేవి రూపంగా భావిస్తారు కాబట్టి, వాటిని కాలితో తొక్కరు. ఆవు పేడతో చిన్న చిన్న ముద్దలు చేసి వాటిని గొబ్బెమ్మలుగా మారుస్తారు. వాటికి పసుపు, కుంకుమ పెట్టి గుమ్మడి, బంతి, చేమంతి వంటి పూలతో అలంకరిస్తారు. చుట్టూ తిరుగుతూ "గొబ్బియెల్లో గొబ్బియెల్లో" అంటూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. అంతేకాకుండా భోగి మంటలు, కొత్త బట్టలు, పిండి వంటలు, గాలిపటాలతో పిల్లలు, బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందేలు.. ఇలా సంక్రాంతిని గొప్పగా జరుపుకుంటారు. ఇతర ప్రాంతాల్లో నివసించేవారు, సొంతింటికి వస్తారు.

సంక్రాంతి 2026 తేదీలు

జనవరి 14 బుధవారం : భోగి పండుగ

జనవరి 15 గురువారం : ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం, మకర సంక్రాంతి

జనవరి 16 శుక్రవారం : కనుమ పండుగ

భోగి పండుగ..!

అతి పెద్ద పండుగగా భావించే ఈ సంక్రాంతి పండుగ భోగితో ప్రారంభమవుతుంది. ఈ భోగి పండుగ తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేస్తారు. పిల్లలు, పెద్దలు, యువతీ, యువకులు, ఆడవాళ్లు, మగవాళ్లు కొత్త బట్టలు ధరిస్తారు. ప్రతి ఇంటి ముందు పెద్ద పెద్ద భోగి మంటలను వేస్తారు. ఉదయపు చలిలో వెచ్చని మంటలతో సేద తీరుతారు. అంతేకాదు పాతకు స్వస్తి చెప్పి కొత్తదనానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల్లో పనికిరాని వస్తువులను, పిడకలను వేస్తారు. చెడు లక్షణాలని భోగి మంటల్లో దగ్ధం చేసి.. కొత్త లక్షణాలను, కొత్త సంతోషాలను ఆహ్వానించేందుకు చిహ్నంగా భోగి మంటల్లో పాత వస్తువులను వేసి దగ్ధం చేస్తారు. అలా భోగి పండుగతో ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగ మొదలవుతుంది. భోగి పండుగ రోజు ఇంట్లో అందరూ ప్రత్యేకమైన, సంప్రదాయమైన వంటలను చేసుకుంటారు.

సంక్రాంతి పండుగ..

ఆ తర్వాత రోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ రోజున ఇంటి ముందర పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల నడుమ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను బంతి, చేమంతులతో అలంకరించి వాటి చుట్టూ డ్యాన్స్‌లు చేస్తారు. హరిదాసులు హరినామ సంకీర్తనలు ఆలపిస్తారు. గంగిరెద్దులవారు బసవన్నను ఆడిస్తూ చిన్నారులను దీవిస్తుంటారు. పవిత్రంగా సాన్నం చేసి, కొత్త బట్టలు ధరిస్తారు. సంక్రాంతి రోజున ఇళ్లలో చనిపోయిన పెద్దలకు ప్రత్యేక పూజలు చేస్తారు. తల్లిదండ్రులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత,ప్రేమను ప్రకటించే పండుగల్లో సంక్రాంత్రికి ప్రత్యేకత ఉంది. సంక్రాంతి పండుగ రోజున ఆ కాలంలో పండే కూరగాయలన్నింటితో కలిపి దప్పలం అనే కూరను చేసుకుంటారు. పిండి వంటలతో ఇంటిల్లిపాది భోజనాలు చేస్తారు. పండుగ సందర్భంగా బంధువులు, చుట్టాలు, స్నేహితులతో అందరి ఇళ్లు కోలాహాలంగా, సందడిగా ఉంటాయి.

కనుమ పండగ..!

సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను రైతులు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రైతులు పాడి పశువులను శుభ్రపరుచుకుంటారు. అనంతరం వాటిని అందంగా అలంకరిస్తారు. కుంకుమ బొట్లు పెట్టి మెడలో పూల దండలు వేసి వాటికి ప్రత్యేకమైన దాణాను అందిస్తారు. గోపూజ చేస్తారు. పంట చేల దగ్గర రైతులు ఇంట్లో వండి పులగాన్ని జల్లుతారు. అంతేకాదు ఆరోజు పూల తోరణాలు, మామిడి తోరణాలతో ఇళ్లను అందంగా మార్చుకుంటారు.

Updated On
ehatv

ehatv

Next Story