విశ్వామిత్రుడు మిథిలానగరానికి వచ్చాడని తెలిసి, జనక మహారాజు స్వయంగా వచ్చి ఆయనకు స్వాగతం పలికాడు.

విశ్వామిత్రుడు మిథిలానగరానికి వచ్చాడని తెలిసి, జనక మహారాజు స్వయంగా వచ్చి ఆయనకు స్వాగతం పలికాడు. రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడు ఆయనకు పరిచయం చేసిన తర్వాత ఇద్దరూ చాలా విషయాలు ముచ్చటించుకున్నారు.

ఎందరో రాజులు తన కుమార్తెను పాణిగ్రహణం కోరుతున్నారని చెప్పాడు జనకుడు. "సీతకు పెళ్ళిఈడు వచ్చేసింది. ఇంకా ఆమెకు వివాహం కాలేదు. యోగ్యుడైన వరుడికి ఇచ్చి చేయాలని వెదుకుతున్నాను” అన్నాడు జనకుడు.

డబ్బు లేనివాడు డబ్బు పోయినప్పుడు ఎంత బాధపడ్తాడో, యుక్తవయస్సు వచ్చినా నాకు పెళ్ళిచేయలేకపోతున్నందుకు మా నాన్న నాకోసం అంత దిగులుపడ్డాడని సీత స్వయంగా అనసూయతో చెప్పింది.

తాను అయోధ్యలో దశరథుడి ఇంట పన్నెండేళ్ళు సర్వభోగాలు అనుభవిస్తూ హాయిగా వున్నానని కూడా చెప్పింది. ఈ లెక్క ప్రకారం సీతవయస్సు అరణ్యవాసానికి వచ్చే కాలానికి 16 + 12 = 28 ఏళ్ళు వుండివుండాలి.

అయితే, సీతకు ఆరవ ఏటనే పెళ్ళి జరిగిందని ఎక్కువమంది రామాయణ కర్తలు రాశారు. వ్యాఖ్యాతలు కూడా పేర్కొన్నారు.

"మమభర్తా మహాతేజా వయసా పంచవింశకః ।

అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||" (10-47-3)

అని వాల్మీకి రామాయణంలో రావణాసురుడు కపటముని వేషంలో వచ్చి సీత వివరాలు అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం అది !

“మహా తేజస్సంపన్నుడయిన నా భర్త ఇరవై ఐదేళ్ళవాడు. నాకు పద్దెనిమిది ఏళ్ళు-” అన్నది సీత. ఈ మాటల్ని కొలబద్దగా తీసుకొంటే, రాముడికి వివిధ వయసుల్లో జరిగిన సంఘటనలు ఇలా వున్నాయి.

1) శ్రీరాముడిని 12వ ఏట విశ్వామిత్రుడు అడవులకు తీసుకువెళ్ళాడు.

2) 13 వ ఏట సీతతో పాణిగ్రహణం.

3) సీతతో 12 ఏళ్ళు అయోధ్యలో కాపురం.

4) 25 వ ఏట పట్టాభిషేక ప్రయత్నం.

5) వనవాస కాలం ప్రారంభానికి రాముడి వయసు 25 ఏళ్ళు మాత్రమే !

6) తర్వాత వివిధ మునుల ఆశ్రమాల్లో 10 ఏళ్ళున్నాడు.

7) పంచవటిలో 3 సంవత్సరాలు వున్నాడు.

8) వనవాసం మొదలుపెట్టిన 13 వ సంవత్సరంలో సీతాపహరణం.

9) సీతాపహరణం జరిగే సమయానికి రాముడి వయస్సు సరిగ్గా 38 ఏళ్ళు.

గోవిందరాజీయం అనే గ్రంథంలో - ఈ వివరాలిస్తూ “ఇదానీంతు రామః అష్టాత్రింశద్వర్షః మమత్వేక త్రింశద్వారా గతాః ఇదానీంతు ద్వాత్రింశో వర్ష వర్షతే||" అన్నాడు. రాముడికి 25 ఏళ్ళు, తనకు 18 ఏళ్ళు అని సీత రావణాసురుడికి చెప్పింది.

వనవాస ప్రారంభం నాటికి - అని అన్వయించుకోవాలని ఈ గ్రంథం చెప్తోంది.

ఆమెకు ఆరేళ్ళ వయసులో పాణిగ్రహణం, పన్నెండేళ్ళు అయోధ్యా నివాసం వెరసి 18 ఏళ్ళు వచ్చేసరికి వనవాసం ప్రారంభం. మునుల ఆశ్రమాలలో 10 ఏళ్ళు, పంచవటిలో 3 ఏళ్ళు, 31 వ ఏట సీతాదేవిని రావణుడు అపహరించినట్లు అర్థం అవుతుంది. ఆమెకు 33 వ ఏట - రాముడితో కలిసి పట్టాభిషేకం జరిగింది!

సీతారాముల వయసు ఎంత అనే వివాదంలో ఇది ఒక వాదన మాత్రమే ! సీతకు యుక్త వయసు వచ్చిన తర్వాతే వివాహం అయ్యింది - అనే వాదన నిజం అయ్యేట్లయితే, సీతాపహరణ సమయానికి ఆమె వయసు 40 ఏళ్ళు దాటి వుండాలి. రాముడి వయసు 50 కి సమీపంలో వుండి వుండాలి... సరే, సీతకు 31 ఏళ్ళు అయినా, 40 ఏళ్ళయినా, అయోధ్యలో గానీ, అరణ్యవాసంలో గాని సీతారాములకు సంతానం కల్గినట్లు ఎక్కడా లేదనేది గమనార్హం. ఇంతకీ ఆ సమయానికి రావణాసురుడి వయసు ఎంత ... అనేది మరో పెద్ద ప్రశ్న! అతను దశరథుడి కాలానికే అరివీర భయంకరుడైన యోధుడు కాబట్టి ఎనభై ఏళ్ళ పైబడ్డవాడే అయివుంటాడు.

Updated On
ehatv

ehatv

Next Story