భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అంశం ఊబకాయం.

భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న అంశం ఊబకాయం. అధిక బరువు అనేక సమస్యలకు కారణంగా మారిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్న వేళ దానికి పరిష్కారాలు కూడా అంతే వేగంగా వచ్చేస్తున్నాయి. నొప్పిలేకుండా బరువు తగ్గాలనుకునే చాలా మందికి ఈ డ్రగ్స్ సులువైన ఎంపికలుగా మారుతున్నాయి.
డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్(Novo Nordisk) బరువు తగ్గడానికి వెగోవీ(Wegovy) పేరుతో ఒక ఔషధాన్ని భారత మార్కెట్లో 2025 జూన్ 24 నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ ఔషధం వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సిన సెమాగ్లూటైడ్ ఆధారిత మందు, ఇది గ్లూకాగన్-లైక్ పెప్టైడ్-1 రిసెప్టర్ అగోనిస్ట్‌గా పనిచేస్తుంది. ఇది ఆకలిని తగ్గించడం, జీర్ణ ప్రక్రియను నెమ్మదించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ ఔషధం దీర్ఘకాలిక బరువు నిర్వహణకు మరియు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి భారతదేశంలో ఆమోదించబడింది. వెగోవీ ఐదు డోసులలో అందుబాటులో ఉంది: 0.25 mg, 0.5 mg, 1 mg, 1.75 mg, 2.4 mg.
ఈ ఔషధం నాలుగు వారాలు తీసుకోవాలి. మొదటి నెల: 0.25 mg వారానికి ఒకసారి, 4 వారాల పాటు తీసుకోవాలి. రెండో నెల: 0.5 mg వారానికి ఒకసారి, 4 వారాల పాటు.. మూడో నెల 1 mg వారానికి ఒకసారి, 4 వారాల పాటు తీసుకోవాలి. ఆ తర్వాత, వైద్యుడు రోగి పురోగతిని బట్టి 1.75 mg లేదా 2.4 mg డోసుకు మార్చవచ్చు లేదా డోసును కొనసాగించవచ్చు.
0.25 mg, 0.5 mg, 1 mg డోసులు.. నెలకు రూ.17,345గా నిర్ధారించారు. 1.75 mg డోసు నెలకు రూ.24,280గా ఉండగా.. 2.4 mg డోసు నెలకు రూ.26,015గా నిర్ణయించారు. ఈ ఔషధం సులభంగా ఉపయోగించే పెన్ డివైస్‌లో అందుబాటులో ఉంటుంది, ఒక్కో పెన్‌లో నాలుగు వారాల డోసులు ఉంటాయి.
క్లినికల్ ట్రయల్స్ ప్రకారం వెగోవీ ఉపయోగించిన వారు 68 వారాలలో సగటున 10-15% శరీర బరువు తగ్గారు. గుండె జబ్బులు, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి ప్రధాన గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారిలో దీర్ఘకాలిక బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
