Viagra for women: శృంగార కోరికలు తగ్గుతున్న స్త్రీలకు వయగ్రా..!

శృంగార కోరికలు తగ్గుతున్న స్త్రీలకు వయగ్రా..!
సాధారణంగా 50 ఏళ్లు దాటిన మహిళల్లో మెనోపాజ్ రావడం, నెలసరి ఆగిపోవడం కారణంగా హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గడం వల్ల శారీరక మార్పులతో పాటు లైంగిక వాంచలు కూడా తగ్గిపోతుంటాయి. అయితే, ఇలాంటి సమస్యతో బాధపడుతున్న మహిళల కోసం వైద్యశాస్త్రం సరికొత్త ఔషధాలను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే అమెరికా ఎఫ్‌డీఏ సరికొత్త ఔషధాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు యువతులకు మాత్రమే పరిమితమైన 'యాడ్డీ' వంటి మాత్రలను, 65 ఏళ్ల వరకు ఉన్న మెనోపాజ్ దాటిన మహిళలకు కూడా వాడొచ్చని అమెరికా ఎఫ్‌డీఏ ప్రకటించింది.. వీటిని 'ఫీమేల్ వయాగ్రా' అని పిలిచినప్పటికీ, ఇవి పురుషుల మందుల కంటే భిన్నంగా పని చేస్తాయి. ఈ ఔషధాలు మెదడులోని కెమికల్స్‌పై ప్రభావం చూపుతాయి. మనసును ఉత్సాహపరిచే డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్ స్థాయిలను పెంచి, కోరికలను తగ్గించే సెరోటోనిన్‌ను నియంత్రిస్తాయి. వీటిని ప్రతిరోజూ పడుకునే ముందు రాత్రి సమయంలో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ మందుల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా ఈ మాత్రలు వేసుకునే ముందు లేదా తర్వాత మద్యం సేవించడం ప్రమాదకరం. దీనివల్ల రక్తపోటు అకస్మాత్తుగా పడిపోయి సొమ్మసిల్లి పడిపోయే అవకాశం ఉంది. వికారం, తల తిరగడం, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ మందులకు దూరంగా ఉండాలి. రోజూ కనీసం అరగంటపాటు నడిస్తే హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్, ఆకుకూరలు తీసుకోవడం వల్ల సహజంగానే శక్తి పెరుగుతుంది. ధ్యానం లేదా యోగా ద్వారా మానసిక ప్రశాంతత పొందితే ఫలితం మెరుగ్గా ఉంటుంది.


