ఆహారం తిన్న తర్వాత పదిహేను నిమిషాల పాటు నడవాలని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ఆహారం తిన్న తర్వాత పదిహేను నిమిషాల పాటు నడవాలని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో రక్తంలో గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. . వృద్ధుల రక్తంలో అధిక చక్కెర స్థాయికి, నడకకు ఉన్న సంబంధం గురించి అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. భోజనం చేసిన అరగంట తర్వాత పదిహేను నిమిషాలు నడిచినవాళ్ల ఆరోగ్యం వాకింగ్ చేయని వారితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్టు గుర్తించారు. అలాగే నలభై అయిదు నిమిషాల పాటు నడిచేవాళ్లలో ఇది మరింత మెరుగ్గా ఉన్నట్టు తేల్చారు. తిన్న తర్వాత పదిహేను నిమిషాల నడక (గంటకు నాలుగు కిలోమీటర్ల వేగంతో) వల్ల జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. తక్కువ కార్బోహైడ్రేట్‌లు ఉండే ఆహారం తీసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు నడిస్తే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. భోజనం తర్వాత వ్యాయామానికి, భోజనానికి ముందు వ్యాయామానికి మధ్య ఉండే తేడాలను గుర్తించేందుకు జరిగిన అధ్యయనంలో తిన్న తర్వాత నడిచేవారి శరీరంలో కొవ్వు నిల్వలు తక్కువగా ఉంటాయని గుర్తించారు.భోజనానంతర నడక వల్ల కార్టిసోల్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. ఇది మెలటోనిన్ విడుదలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల సుఖవంతమైన నిద్ర పడుతుంది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.


