పద్నాలుగో దలైలామా తొలి హిందీ మూల జీవిత చరిత్ర ఆవిష్కరణతో శనివారం సమకాలీన భారత సాహిత్యానికి కొత్త బలం చేకూరింది. ఈ పుస్తకాన్ని ప్రఖ్యాత జర్నలిస్ట్, ప్రముఖుల జీవితకథల రచయిత డాక్టర్‌ అరవింద్‌ యాదవ్‌ రాశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగిన విశేష కార్యక్రమంలో ఈ గ్రంథం విడుదలైంది. ప్రసిద్ధ రాజనీతజ్ఞుడు, పండితుడు, రచయిత పద్మవిభూషణ్‌ డాక్టర్‌ కరణ్‌సింగ్‌ దేశ రాజధానిలో దలైలామా జీవిత చరిత్రను ఆవిష్కరించారు. ఈ కొత్త పుస్తకం తొలి ప్రతిని పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మురళీమనోహర్‌ జోషీకి అందజేశారు. ఢిల్లీ టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషే దోర్జీ దందూల్‌ కూడా ఈ కార్యక్రమానికి దలైలామా అధికార ప్రతినిధిగా హాజరయ్యారు. సభకు అధ్యక్షత వహించిన డా.కరణ్‌సింగ్‌ ప్రసంగిస్తూ బౌద్ధ గురువు కొత్త జీవిత చరిత్రను పరిచయం చేశారు. దలైలామా జీవితాన్ని, బోధనలను కళ్లకు కట్టే ఈ కొత్త జీవితకథ భారత సాహిత్యానికి గొప్ప సంపద అని, భిన్న ధర్మాల గురించి అనేక వర్గాల ప్రజల అవగాహనను పెంచుతుందని స్పష్టంచేశారు. దలైలామా జీవితం ఒక ఆధ్యాత్మిక నాయకుని జీవనయానాన్ని మాత్రమే చెప్పదనీ, శాంతి, కరుణ, మానవ విలువలకు సంబంధించి ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజలకు గొప్ప సందేశం ఇస్తుందని కరణ్‌సింగ్‌ పేర్కొన్నారు. టిబెట్‌ బౌద్ధ గురువుతో తనకు వ్యక్తిగతంగా ఉన్న బంధం గురించి ప్రస్తావిస్తూ, 1956లో తాము మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచీ తాము మంచి స్నేహితులుగా కొనసాగుతున్నామని ఆయన అన్నారు. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తమను పరిచయం చేశారని ఆయన తెలిపారు. ఈ పుస్తక రచనలో డా.అరవింద్‌ యాదవ్‌ విశేష కృషిని, సాహిత్య సేవలో అంకితభావాన్ని డా.సింగ్‌ ప్రశంసించారు. ‘‘దలైలామా జీవిత చరిత్ర మొత్తాన్ని హిందీలో రాయడం ద్వారా డా. అరవింద్‌ యాదవ్‌ గొప్ప సాహసాన్ని ప్రదర్శించారు. అనేక సంవత్సరాలుగా ఈ గ్రంథ రచనలో ఆయన నిమగ్నమయ్యారు. ఈ గొప్ప రచన పూర్తయినందుకు నేడు నాకెంతో సంతోషంగా ఉంది. దలైలామా గురించి ప్రజలు మరింత తెలుసుకోవడానికి వీలుగా ఈ కొత్త పుస్తకాన్ని అన్ని హిందీ గ్రంథాలయాలకు అందించాలని కోరుకుంటున్నాను. పూజ్య గురువర్యులు దీర్ఘకాలం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన కీలక బోధనలైన కరుణ, శాంతి, అహింస దేశవ్యాప్తంగా వ్యాప్తిచెందుతూనే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను.


గొప్ప బోధనలతో అందరినీ ప్రభావితం చేసిన దలైలామా: జోషీ


దలైలామా ఆధ్యాత్మిక తత్వం, ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రభావంపై డా.మురళీమనోహర్‌ జోషీ వివరంగా ప్రసంగించారు. పైకి సాధారణంగా కనిపించే దలైలామా తన ఘనమైన బోధనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు, ఆలోచనాపరులు, యువకులపై ఆయన ప్రభావం ఎంతటి గొప్పదో చెప్పారు. దలైలామా కొత్త జీవితకథ ‘‘భవిష్యత్‌ తరాలకు ఎంతో విలువైన మూల సంపద,’’ అని డా.జోషీ వర్ణించారు. టిబెట్‌ ఎదుర్కొన్న రాజకీయ, సాంస్కృతిక సవాళ్ల గురించి ఆయన వివరించారు. ‘‘వివిధ యోగా సాంప్రదాయాలను, అంతర్గత ఆధ్యాత్మిక శక్తులను దలైలామా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వాటిపై గట్టి పట్టు సంపాదించారు. చైనా దుందుడుకు విధానాలు దలైలామాను తన మాతృభూమిని విడిచిపోయేలా చేశాయి. అంతేకాదు, అవి టిబెట్‌ ప్రజలను అణచివేయడమేగాక, వారి సాంస్కృతిక ఉనికిని చెరిపివేయడానికి ప్రయత్నించాయి. చైనా దాష్టీకాల వల్ల టిబెట్‌ ప్రజలు తమ మాతృభూమిని వదిలిపోవాల్సి వచ్చింది. ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో వారు ఆశ్రయం పొంది జీవించాల్సివస్తోంది. ఏ మతానికీ భారతదేశం ఎన్నడూ హానిచేయలేదు. కాని, మతాన్ని ప్రచారం చేసేవారిని అణచివేసే తన ధోర ణిని చైనా కొనసాగిస్తోంది. ఎట్టకేలకు టిబెట్‌ తమ పోరాటంలో విజయం సాధిస్తారనే నమ్మకం నాకు ఉన్నది,’’ అని డా.జోషీ పేర్కొన్నారు. పరమపూజ్య గురువర్యులు దలైలామా ప్రతినిధిగా గెషే దోర్జీ దందూల్‌ మాట్లాడుతూ, హిందీలో దలైలామా మూల జీవితకథను ఎంతో అంకితభావంతో రచించారని ప్రశంసించారు. దలైలామా జీవితం, బోధనలపై అసలు సిసలు అవగాహనతో చక్కటి హిందీ మూల గ్రంథాన్ని రాసినందుకు అరవింద్‌ యాదవ్‌ను అభినందించారు. ఇంకా దలైలామాతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధానికి సంబంధించిన విశేషాలు తన ప్రసంగంలో దందూల్‌ ప్రస్తావించారు. కరుణ, అంతర్గత పరివర్తన, టిబెట్‌ బౌద్ధంతో భారతదేశానికి ఉన్న చారిత్రక సంబంధం గురించి గెషే చక్కగా వివరించారు.


టిబెట్‌ ప్రజల కథను సజీవంగా నిలిపిన అరవింద్‌ యాదవ్‌ :-


పరమపూజ్య దలైలామా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా పంపిన సందేశంలో రచయిత గురించి ప్రస్తావిస్తూ, ‘‘టిబెట్‌లో నా తొలి రోజుల నుంచి ఇండియాలో ఆశ్రయం పొంది, వలస జీవితం ప్రారంభించడం వరకూ నా జీవితం గురించి ఈ పుస్తకంలో డా.యాదవ్‌ చక్కగా వర్ణించారు. టిబెట్‌ ప్రజల జీవన కథను ఎన్నటికీ నిలిచిపోయేలా రాశారు. అహింస, శాంతియుత సంప్రదింపులకు మేము సహనంతో ఎంతగా కట్టుబడి ఉన్నదీ రచయిత బాగా వర్ణించారు. మానవ విలువలు, మత సామరస్యం, టిబెబ్‌ ధర్మం, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణకు నాకున్న శ్రద్ధ గురించి ఈ పుస్తకంలో తెలిపారు. ప్రాచీన భారత జ్ఞానంపై జనంలో విస్తృత అవగాహన, ఆసక్తి పెంచడానికి నా కృషి గురించి కూడా బాగా ఇందులో వివరించారు. టిబెట్‌పై పుస్తకం రాసి, దాని సంపన్న వారసత్వం, విమోచన పోరాటం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తానని 2022లో మేం మొదటిసారి కలుసుకున్నప్పుడు ఇచ్చిన హామీని అరవింద్‌ యాదవ్‌ నిలబెట్టుకున్నందుకు నేను మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను,’’ అని పేర్కొన్నారు.

హిందీ, ఇంగ్లిష్, తెలుగు పాత్రికేయరంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న అరవింద్‌ యాదవ్‌ గతంలో సాక్షి టీవీ, టీవీ నైన్‌ తెలుగు చానల్‌లో పనిచేశారు. ఆయన కొన్నేళ్ల పరిశోధనతో హిందీలో రాసిన మూల గ్రంథం ఇది. ఈ పుస్తక రచనలో ఏ విషయాన్నీ ఎక్కడ నుంచీ అనుసరించడం గాని, ఏ ఒక్క అంశాన్ని అనువదించడం గాని జరగలేదు. దలైలామా, టిబెట్‌ బౌద్ధానికి సంబంధించి అనేక మంది వ్యక్తులతో మాట్లాడడమేగాక, టిబెట్‌కు చెందిన మూలాలు, బోధనలు, చారిత్రక రికార్డులు, అనేక మంది సొంత అనుభవాలు తెలుసుకుని అరవింద్‌ యాదవ్‌ ఈ జీవితకథ రచించారు.

దలైలామా జీవితం, టిబెట్‌ ఆధునిక చరిత్రకు సంబంధించిన అనేక విషయాలను ఈ పుస్తకం మొదటిసారి వెల్లడిస్తోంది. ఇది వరకు వచ్చిన ఏ గ్రంథంలోగాని, చారిత్రక దస్తావేజులు, రికార్డుల్లోగాని కనిపించని విషయాలు, ఘటనలు ఈ కొత్త జీవిత చరిత్రలో మనకు దర్శనమిస్తాయి. ఆధునిక టిబెట్‌ చరిత్రకు సంబంధించి గతంలో విస్మరించిన అనేక అంశాలతో కూడిన అధ్యాయాలను చక్కటి స్పష్టత, లోతైన అవగాహనతో ఈ పుస్తకంలో రచయిత వివరించడం విశేషం.

డా.అరవింద్‌ యాదవ్‌ రాసిన ఈ గ్రంథం సాహిత్యపరంగా గొప్ప విజయం మాత్రమే కాదు. ఇది టిబెట్‌ బౌద్ధం, సమకాలీన ప్రపంచ చరిత్రకు సంబంధించిన విశేష సాక్ష్యాధార పత్రంగా నిలిచిపోతుంది. టిబెట్‌ను చైనా ఆక్రమించడం, టిబెట్‌ ప్రజలు తమ విశ్వాసాన్ని, సంస్కతి, భాష, వైద్య సాంప్రదాయాలు, కళా వారసత్వాలను పరిరక్షించుకోవడానికి సాగిస్తున్న వీరోచిన పోరాటాన్ని ఈ గ్రంథం పాఠకుల కళ్లకు కడుతుంది. వారికి లోతైన అవగాహన కలగడానికి తోడ్పడుతుంది.

పరమపూజ్య దలైలామా బాల్యంలో సాగించిన ప్రయాణాలు, టిబెట్‌లో చిన్న వయసులోనే పొందిన గుర్తింపు నుంచి భారతదేశానికి ఆయన తన బృందంతో పయనమై తప్పించుకుని రావడం, విశ్వవ్యాప్తంగా పర్యటనలు, శాంతి స్థాపనకు కృషి, ఆధ్యాత్మిక బోధనలు, శాస్త్రవేత్తలతో సంభాషణలు, మానవాళి శ్రేయస్సు కోసం జీవితాంతం సాగించిన కృషి ఈ కొత్త జీవిత చరిత్రలో పాఠకులకు చక్కగా రచయిత వివరించారు. అంతేకాదు, ప్రపంచంలో అత్యధిక ప్రజానీకం గౌరవించి, పూజించే ఆధ్యాత్మిక నాయకుల్లో ఒకరైన దలైలామా మానవ జీవిత చిత్రాన్ని ఈ జీవితచరిత్రలో ఎంతో ఆసక్తికరంగా, మనోజ్ఞంగా, సమగ్రంగా వర్ణించారు.

గౌరవనీయులైన దలైలామాపై రాసిన ఈ నూతన జీవిత చరిత్రను త్వరలోనే ఇంగ్లిష్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఇంకా ఇతర భారతీయ భాషల్లో కూడా ప్రచురిస్తారు. మానవాళిపై చూపించాల్సిన కరుణ, ప్రపంచ ప్రజలందరూ పాటించాల్సిన బాధ్యతకు సంబంధించి దలైలామా సందేశం ఈ విధంగా దేశ ప్రజలందరికీ చేరుతుంది.



Updated On 16 Nov 2025 9:56 AM GMT
ehatv

ehatv

Next Story