ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌలభ్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కర్నూలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, అమ్మాయిలు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఏపీఎస్‌ఆర్‌టీసీ(APSRTC) నడిపే పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రకటన ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటిగా ఉంది.
రాష్ట్రంలోని అన్ని వయసుల మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఎటువంటి ఛార్జీ లేకుండా ప్రయాణించే అవకాశం పొందుతారు. పల్లె వెలుగు(Palle Velugu) బస్సులు గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తాయి, అలాగే ఎక్స్‌ప్రెస్ (Express )బస్సులు నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఈ సౌలభ్యం రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే వర్తిస్తుందని, అయితే సరిహద్దు ప్రాంతాల వరకు ప్రయాణించే వారికి ఇది గణనీయమైన ఊరటను కలిగిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్‌ఆర్‌టీసీకి రూ. 18.2 కోట్ల నిధులను కేటాయించినట్లు సమాచారం.
ఈ పథకం అమలు కోసం ఏపీఎస్‌ఆర్‌టీసీ అదనపు బస్సులు మరియు మానవ వనరులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రోజువారీ 40 లక్షల మంది ప్రయాణికులలో 15 లక్షల మంది మహిళలు ఈ పథకం వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉందని అంచనా. ఇది రోజువారీ రూ. 4 కోట్ల ఆదాయ నష్టాన్ని కలిగించవచ్చని, నెలకు రూ. 120 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం తమిళనాడు, తెలంగాణ(Telangana), కర్ణాటక(karnataka) రాష్ట్రాల్లో అమలవుతున్న సారూప్య పథకాలను అధ్యయనం చేసి, సమర్థవంతమైన విధానాలను రూపొందిస్తోంది.
