ప్రముఖ ప్రవచనకర్త, పండితులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఓ సభలో తీవ్ర అసహనానికి గురయ్యారు.

కొణిజేటి రోశయ్య జయంతి సభలో ఘటన
ప్రసంగిస్తుండగా ఫోటోల కోసం ఎగబడ్డ జనం
ప్రసంగం ఆపి తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చాగంటి
'ఇది మర్యాద కాదు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు
వెంటనే కిందకు వెళ్లి కూర్చోవాలని సూచన
రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చాగంటి
ప్రముఖ ప్రవచనకర్త, పండితులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఓ సభలో తీవ్ర అసహనానికి గురయ్యారు. వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీయడానికి గుంపుగా చేరడంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ సభలో చాగంటిని సత్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా, పలువురు అభిమానులు, నాయకులు వేదికపై ఆయన వెనుక చేరి ఫోటోలు తీయడం ప్రారంభించారు. దీంతో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపిన చాగంటి, వారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఒక మహానుభావుడి గురించి నివాళి అర్పిస్తూ మాట్లాడేటప్పుడు కనీస మర్యాద పాటించడం ధర్మం. ఇలా వెనకాల నిలబడి ఫోటోలు తీయడం మర్యాద కాదు. మీరందరూ కిందకు వెళ్ళి కూర్చోండి" అని ఆయన కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు. "మాట్లాడటానికి నాకేమీ భయం లేదు, మీరెవరూ నా వెనుక నిలబడాల్సిన పనిలేదు. సభకు ఒక గౌరవం ఉండాలి" అంటూ క్రమశిక్షణ పాటించకపోవడంపై చురకలు అంటించారు.
అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, రోశయ్య గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను చెన్నైలో ప్రవచనాలు ఇస్తున్నప్పుడు, అప్పటి తమిళనాడు గవర్నర్‌గా ఉన్న రోశయ్య గారు స్వయంగా ఫోన్ చేసి రాజభవన్‌కు ఆహ్వానించారని, తన పట్ల ఎంతో గౌరవం చూపించారని వివరించారు.
