Joan Murray : అల్లంత ఎత్తు నుంచి కిందపడింది.. అయినా ప్రాణాలతో బయటపడింది.. ఎలా?
భూమ్మీద నూకలు మిగిలుండాలే కానీ ఆకాశం నుంచి జారిపడ్డా బతికి బట్టకట్టొచ్చు. జోన్ ముర్రే(Joan Murray) అనే 40 ఏళ్ల మహిళకు ఇదే జరిగింది. ఆమె ఆయుష్షు గట్టిది కాబట్టే అల్లంత ఎత్తునుంచి కిందపడ్డా బతికేసింది. 1999, సెప్టెంబర్ 25న జోన్ ముర్రే జీవితంలో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి పారాచూట్(Parachute) సాయంతో స్కైడైవింగ్‌కు(Sky diving) ప్రయత్నించింది.

Joan Murray
భూమ్మీద నూకలు మిగిలుండాలే కానీ ఆకాశం నుంచి జారిపడ్డా బతికి బట్టకట్టొచ్చు. జోన్ ముర్రే(Joan Murray) అనే 40 ఏళ్ల మహిళకు ఇదే జరిగింది. ఆమె ఆయుష్షు గట్టిది కాబట్టే అల్లంత ఎత్తునుంచి కిందపడ్డా బతికేసింది. 1999, సెప్టెంబర్ 25న జోన్ ముర్రే జీవితంలో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి పారాచూట్(Parachute) సాయంతో స్కైడైవింగ్‌కు(Sky diving) ప్రయత్నించింది. దురదృష్టం కొద్దీ పారాచూట్ తెరచుకోలేదు. ఆమెకు సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా విఫలమయ్యింది. ఫలితంగా జోన్ ముర్రే గంటకు 80 మైళ్ల వేగంతో భూమ్మీదకు దూసుకొచ్చింది. అప్పుడు మాత్రం ఆమెకు అదృష్టం తోడయ్యింది. లక్కుంది కాబట్టే అగ్ని చీమల దండుపై పడింది. ఆమె ప్రాణాన్ని ఈ అగ్ని చీమలే కాపాడాయి. అపస్మారక స్థితికి చేరిన జోన్ ముర్రేపైకి అగ్నిచీమలు(Fire ants) దండెత్తాయి. ఈ దాడి కారణంగానే ఆమె ప్రాణాలతో బయటపడిదంటే నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజం. ఆమెకు చికిత్స అందించిన డాక్టర్లే ఈ మాట చెప్పారు. ఆ అగ్ని చీమల దాడికి ముర్రే శరీరంలోని నరాలు ఉత్తేజితమయ్యాయట! ఆమె గుండె కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందట! తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి వెళ్లే వరకు అగ్ని చీమలు ఆమె ప్రాణాలతో ఉండేలా సహాయపడ్డాయని వైద్యులు తెలిపారు. హాస్పిటల్‌లో ముర్రే రెండు వారాల పాటు కోమాలో ఉంది. వైద్యులు ఆమె ప్రాణాన్ని నిలిపి ఉంచేందుకు అనేక శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ఆమె ప్రాణాలతో బయటపడటానికి వైద్యుల కృషి ఎంత ఉందో అగ్నిచీమల పాత్ర కూడా అంతే ఉంది.
