'గుత్తా జ్వాల''.. ఔదార్యం..! తన 30 లీటర్ల పాలు దానం..!

బ్యాడ్మింటన్ స్టార్ గుత్తాజ్వాల ఈ మధ్యే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను ప్రభుత్వ ఆస్పత్రులకు దానం చేశారు. తల్లి పాలు సరిగా రాని పిల్లలకు ఇవి ఉపయోగపడతాయని ఆమె ఈ పనిచేశారు. తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించిన గుత్తాజ్వాల దాదాపు 30 లీటర్ల వరకు ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేశారు. ఇలా చేయడం ద్వారా పాలుపడని తల్లుల పిల్లలను ఆదుకోగలిగారు. గుత్తాజ్వాల తనలో ఉన్న మాతృహృదయాన్ని చాటడంతోపాటు తల్లిపాలకు ఎంత ప్రాధాన్యం ఉందో సమాజానికి చెప్పగలిగారు. ఇలాంటి తల్లులు మరింత మంది ముందుకొస్తే అమ్మపాలు దొరకని శిశువుల ప్రాణాలు కాపాడే అవకాశముంది. ప్రభుత్వం కూడా మిల్క్ బ్యాంకులను ఏర్పాటు చేస్తోంది.
పౌష్టికాహార లేమి.. అనారోగ్య సమస్యతో తల్లికి పాలు పడక, అప్పుడే పుట్టిన చిన్నారులకు తల్లి ఒడిలో హాయిగా పడుకొని పాలు తాగాల్సిన నవజాత శిశువులు అమ్మ అమృతధార దొరకక ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా నవజాత శిశుమరణాలు పెరుగుతున్నాయి. పాలు పడని తల్లుల పిల్లల ప్రాణాలు నిలిపేందుకు పలువురు తల్లులు తమ పాలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇలా ముందుకొచ్చిన మాతృమూర్తుల అమృతధారలను నిల్వ చేసే మిల్క్ బ్యాంక్ కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిల్క్ బ్యాంకులు ఎక్కడా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని నవజాత శిశువులు పాల కోసం తల్లడిల్లుతున్నారు. మిల్క్ బ్యాంకులను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే తల్లి పాలు దొరకక అవస్థలు పడే శిశువులకు ఉపయోగపడతాయని మహిళలు కోరుతున్నారు.


