చేవెళ్ల మండల పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది.

చేవెళ్ల మండల పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఈ వేకువ జామున హైదరాబాద్‌కు బయల్దేరింది. తొలి ట్రిప్పు బస్సు కావడంతో అధిక సంఖ్యలో జనాలు ఎక్కారు. ఈలోపు.. బస్సు మీర్జాగూడ వద్దకు చేరుకోగానే కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఆపై టిప్పర్‌ ఒరిగిపోవడంతో కంకర లోడ్‌ మొత్తం బస్సులోకి పడిపోయింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసం అయ్యింది. బస్సు, టిప్పర్‌ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వాళ్లను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు.

ఘటనా స్థలం వద్ద, బస్సుల్లో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. తమను కాపాడాలంటూ కంకరలో కూరుకుపోయిన వాళ్లు వేడుకోవడం.. అచేతనంగా కొందరు పడి ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 30మందికిపైగా తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.. అయితే ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు చనిపోయారు. తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సొంత అక్కాచెల్లెళ్లు చనిపోయారు. ఇందులో ఒకరికి 15 రోజుల క్రితమే వివాహం జరిగింది. కాళ్ల పారాణి ఆరకముందే కూతురు విగత జీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు కూడా వీరి మృతిని తట్టుకోలేక విలవిలాడుతున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story